హరీశ్ రావును రాజ్ భవన్ కు రమ్మన్న గవర్నర్
మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సు పెంపు బిల్లుపై వివరణ ఇచ్చేందుకు రాజ్ భవన్ కు రావాలంటూ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావుకు గవర్నర్ తమిళిసై నుంచి పిలుపు వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావును గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ కు రమ్మని పిలిచారు. ఆయన డిపార్ట్ మెంట్ కు సంబంధించి తనకు కొన్ని వివరణలు కావాల్సి ఉందని ఆమె తెలియజేశారు.
మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్ళనుంచి 65 ఏళ్లకు పెంచుతూ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. అది చట్టంగా మారాలంటే గవర్నర్ సంతకం కావాలి. అందుకోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సంతకం కోసం గవర్నర్ దగ్గరికి పంపింది సర్కార్. అయితే దానిపై ఆమెఅసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. టీచింగ్ స్టాఫ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల రిటైర్మెంట్ వయస్సును కూడా పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వివరణలు ఇవ్వడం కోసం రాజ్ భవన్ కు రావాలంటూ హరీశ్ రావుకు పిలుపు వచ్చింది.
ఇప్పటికే ఈ బిల్లు చాలా కాలంగా గవర్నర్ వద్ద ఉంది. ప్రతి బిల్లుపై గవర్నర్ ఇలాగే వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో గవర్నర్ మళ్ళీ మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సు పెంపు బిల్లును పెండింగులో పెట్టడం పై ప్రభుత్వం గుర్రుగా ఉంది.