తెలంగాణలో ఆ పార్టీనే గెలిపించండి.. ఓటర్లకు తమిళనాడు సీఎం విజ్ఞప్తి
తమిళనాడుకు వెళ్లిన కేసీఆర్ బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సీఎం స్టాలిన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలివిడిగా కనిపించారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని డీఎంకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో ఉన్న డీఎంకే సానుభూతిపరులు కాంగ్రెస్ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. హస్తం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచేలా కృషిచేయాలని కోరారు.
కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కొన్నేళ్లుగా పొత్తులో ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' కూటమిలో కూడా డీఎంకే భాగస్వామి. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే స్టాలిన్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాలని స్టాలిన్ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఆసక్తి కలిగిస్తోంది. సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కోరారు. ఆ సమయంలోనే తమిళనాడుకు వెళ్లిన కేసీఆర్ బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సీఎం స్టాలిన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలివిడిగా కనిపించారు. కాగా, తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణలో స్థిరపడ్డ తమిళ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చినట్లయ్యింది.
తమిళనాడుకు చెందిన చాలామంది ప్రజలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మల్కాజిగిరి, తిరుమలగిరి, పద్మారావు నగర్, దయానంద్ నగర్, కైలాస్ గూడ, సఫిల్ గూడ, మెట్టుగూడ, కనాజీ గూడ, అమ్ముగూడ, బొల్లారం, అల్వాల్, రెజిమెంటల్ బజార్, తార్నాక వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తమిళులు ఉన్నారు. స్టాలిన్ ప్రకటన ఆయా ప్రాంతాల ఫలితాలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు.