సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా తలసాని.. కేసీఆర్ ప్రతిపాదన
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కూడా తన కొడుకు సాయికిరణ్‌యాదవ్‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 4 పార్లమెంట్ స్థానాలకు BRS అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను పోటీలో నిలపడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ బాస్. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ స్థానంలో BRS అభ్యర్థి ఎవరన్నదానిపై నిన్న, మొన్నటివరకు సస్పెన్స్ కొనసాగింది. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కూడా తన కొడుకు సాయికిరణ్‌యాదవ్‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదన విన్న కేసీఆర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌నే పోటీకి దిగాలని కోరినట్లు తెలుస్తోంది. పోటీకి తలసాని కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి 62 వేల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయికిరణ్ యాదవ్.. 3 లక్షల 22 వేల ఓట్లు సాధించి సెకండ్ ప్లేసులో నిలిచారు.