ఆ ఇద్దర్నీ పార్టీ నుంచి తొలగిస్తేనే మాట్లాడుతా .. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్ లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి రచ్చ ఆగడం లేదు. ఎంత మంది నాయకులు నచ్చజెప్పినా ఆయన వినడంలేదు. కనీసం తాను నాయకులతో మాట్లాడాలన్నా ముందు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ లను పార్టీ నుంచి తీసేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
తనను దుర్భాషలాడిన అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ ఇంకా పార్టీలోనే ఉన్నారని, వారిని పార్టీ నుంచి తొలగిస్తేనే తాను మాట్లాడుతానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నన్ను ఎవరూ కలవాల్సిన అవసరం లేదని, పార్టీలోనే ఉండి ఇక్కడే తేల్చుకుంటానని చెప్పారు. నన్ను దయాకర్, చెరుకు సుధాకర్ బూతులు తిట్టారు..అయినా వారిపై చర్య తీసుకోలేదు..వారిమీద కఠిన చర్యలు తీసుకునేంతవరకు నేను తగ్గేదే లేదు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని, తాను తప్పేమీ చేయలేదని, అలాంటిది ఎవరైనా నిందలు వేస్తే తట్టుకోలేనన్నారు. చండూరు సభలో తనపై దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఆయన.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దయాకర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినా ఆయన స్పందించలేదు. మొదట అవమానించడం, తరువాత క్షమాపణలు చెప్పడం వారికి అలవాటైందని విమర్శించిన వెంకటరెడ్డి రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పై విరుచుకపడ్డారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కోరిన ఆయన.. పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ వంటివారిని ఈ పదవికి ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.మాణిక్కం ఠాగూర్ డ్రామాలాడుతూ సీనియర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి వెంకటరెడ్డి గైర్ హాజరయ్యారు. ఇందుకు కారణాలను వివరిస్తూ పార్టీ నాయకత్వానికి సుదీర్ఘమైన లేఖ రాశారు. పైగా రేవంత్ తో వేదిక పంచుకోలేనని, మునుగోడు ప్రచారానికి వెళ్లబోనని కుండబద్దలు కొట్టారు. 30 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నానని, కానీ ఇప్పటికీ తనకు సరైన గుర్తింపు లేదని ఆయన వాపోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారవచ్చునని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అలాంటిదేమీ ఉండదని వెంకటరెడ్డి చెబుతున్నప్పటికీ.. ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం దీన్ని తోసిపుచ్చడం లేదు. ఇప్పటికే ఆయనను బుజ్జగించడానికి సీనియర్ నేతలు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. దీంతో నేరుగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి.. వెంకటరెడ్డి సీనియర్ నేత అని, ఆయనకు మళ్ళీ నచ్చజెప్పాలంటూ మధుయాష్కీ, దామోదర్ లకు సూచనలు చేశారని సమాచారం.