Telugu Global
Telangana

రూ.1,600 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ఆసియాలో అతిపెద్ద కూలింగ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ చేపట్టనున్న తబ్రీడ్

రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని స్థిరమైన భవిష్యత్ కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

రూ.1,600 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ఆసియాలో అతిపెద్ద కూలింగ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ చేపట్టనున్న తబ్రీడ్
X

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానున్నది. ఆసియాలోనే అతిపెద్ద కూలింగ్ డిస్ట్రిక్ ప్రాజెక్టును చేపట్టడానికి యూఏఈకి చెందిన తబ్రీడ్ ముందుకు వచ్చింది. శీతలీకరణ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తబ్రీడ్.. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తబ్రీడ్ సంస్థ సీఈవో ఖలీద్ అల్ ముర్జుకి.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఎంవోయూపై సంతకాలు చేశారు.

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్దతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం 200 మిలియన్ డాలర్లు (షుమారు రూ.1,600 కోట్లు) పెట్టబడిని తబ్రీడ్ పెట్టనున్నది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీలో తబ్రిడ్ కంపెనీ 1,25,000 చదరపు అడుగుల డిస్ట్రిక్ కూలింగ్ ప్లాంట్స్, నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నది. పరిశ్రమల అవసరాల లాంగ్‌టర్మ్ కూలింగ్ సర్వీసులను అందించనున్నది. ఫార్మా సిటీలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల ప్రాంతంలో కూలింగ్ సర్వీసును అందించనున్నది. దీని వల్ల హైదరాబాద్ నగరంలో కాలుష్యం, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రపంచ అత్యుత్తమ నగరాల సరసన చేరడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడనున్నది.

ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్‌లో 200 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్‌ను తగ్గించే అవకాశం ఉన్నది. అంతే కాకుండా 30 ఏళ్లలో వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్‌ను 18 మిలియన్ టన్నుల మేర తగ్గించవచ్చు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని స్థిరమైన భవిష్యత్ కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అన్నారు.

ఇప్పటికే కూల్ రూఫ్ పాలసీని ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం తీసుకున్నదని.. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ కూలింగ్ ప్రాజెక్టు వల్ల మరింత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే అవకాశం కలుగుతున్నదని చెప్పారు. 2027 కల్లా తెలంగాణను నెట్-జీరోగా (గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ను పూర్తిగా అరికట్టడం) లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 6,800 గిగావాట్ల కరెంటుతో పాటు.. 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు.

First Published:  6 Sept 2023 5:37 PM IST
Next Story