Telugu Global
Telangana

పల్లె వెలుగులో 'టీ9-30 టికెట్'.. టీఎస్ఆర్టీసీలో మరో కొత్త పథకం

టీ9-30 టికెట్‌ను రూ.50 చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా 30 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది.

పల్లె వెలుగులో టీ9-30 టికెట్.. టీఎస్ఆర్టీసీలో మరో కొత్త పథకం
X

వినూత్న పథకాలతో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గిస్తుండటమే కాకుండా.. ఆదాయాన్ని కూడా టీఎస్ఆర్టీసీ పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో పథకానికి తెరతీసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరాల కోసం పల్లెవెలుగు బస్సులను ఆశ్రయించే వారి కోసం సరికొత్త రాయితీ పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే అమలులో ఉన్న 'టీ9-60 టికెట్'కు మంచి ఆదరణ వస్తుండటంతో.. తాజాగా 'టీ9-30 టికెట్'ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో 'టీ9-30 టికెట్'కు సంబంధించిన పోస్టర్‌ను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు.

టీ9-30 టికెట్‌ను రూ.50 చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా 30 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. గురువారం (జూలై 27) నుంచే ఈ టికెట్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులోకి ఉంటుంది. అయితే, ఈ టికెట్‌ను సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జారీ చేస్తారని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, సజ్జనార్ తెలిపారు.

రాష్ట్రంలోని పల్లె, పట్టణాల మధ్య చాలా మంది వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు నిత్యం స్వల్ప దూరాలే ప్రయాణిస్తూ ఉంటారు. 30 కిలో మీటర్ల పరిధిలో రానుపోను ఈ టికెట్ ద్వారా ప్రయాణించే వీలుంటుంది. కాబట్టి అలాంటి వారికి టీ9-30 టికెట్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వారు వెల్లడించారు. టీ9-30 టికెట్ కొనుగోలు చేయడం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇక టీ9-30 టికెట్ కొనుగోలు చేసిన వారు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ సర్వీసులో కూడా ప్రయాణం చేయవచ్చు.

టీ9-30 టికెట్ ప్రస్తుతం ఒక నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ స్కీమ్ పొడిగించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ టికెట్ తప్పకుండా ఉపయోగపడుతుందని.. వీలైనంత వరకు టీ9-30 టికెట్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, సజ్జనార్ తెలిపారు.

టీ9-60 టికెట్ ఇకపై అందరికీ..

పల్లె వెలుగులో ప్రయాణించే వారి కోసం ఇటీవలే అందుబాటులోకి తీసుకొని వచ్చిన టీ9-60 టికెట్ ఇకపై అందరికీ వర్తింప చేయనున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు మహిళలు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ టికెట్ అందుబాటులో ఉన్నది. కానీ జూలై 27 నుంచి పురుషులు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కేవలం రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించేందుకు ఈ టికెట్ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ టికెట్‌కు మంచి స్పందన వచ్చినందున.. పురుషులకు కూడా వర్తింప చేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

టీ9-30, టీ9-60 టికెట్లను ఉపయోగించి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణించ వచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే రెండు టికెట్లను ప్రవేశపెట్టామని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. టీ9-30 టికెట్‌కు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకోవడానికి టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040-23450033 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.




First Published:  27 July 2023 8:41 AM IST
Next Story