Telugu Global
Telangana

టీ-వర్క్స్‌తో క్వాల్‌కామ్ ఒప్పందం.. పీసీబీల తయారీ ఇక మరింత వేగం

టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కేవలం ఒక రోజులోనే 12 లేయర్ల పీసీబీ ప్రోటోటైప్‌ను తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది.

టీ-వర్క్స్‌తో క్వాల్‌కామ్ ఒప్పందం.. పీసీబీల తయారీ ఇక మరింత వేగం
X

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ-వర్క్స్ ఫెసిలిటీ దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ పని చేయడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్.. టీ-వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిలో భాగంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీ-వర్క్స్, క్వాల్‌కామ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి.

ప్రస్తుతం ఒక పీసీబీ ప్రోటోటైప్ తయారు చేయాలంటే 15 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. పీసీబీ మాన్యుఫ్చాక్చరర్లు ఎలక్ట్రినిక్ చిప్ బోర్డు తయారీని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా డివైజ్ (ఏసీ, ఫ్రిజ్, ఎలక్ట్రినిక్ వెహికిల్స్ లాంటివి) సక్రమంగా పని చేయాలంటే ఈ పీసీబీలు చాలా ముఖ్యం. ఒక రకంగా దీన్ని ఆ డివైజ్ గుండెగా అభివర్ణించవచ్చు. అయితే తొలి సారి ఏదైనా కంపెనీ పీసీబీని తమ అవసరాలకు అనుగుణంగా తయారు చేయించుకోవాలంటే సరైన మాన్యుఫ్యాక్చరర్‌తో పాటు దాని డిజైన్ చేసే వాళ్లు దొరకడం చాలా కష్టం. ఒక వేళ దొరికినా కనీసం రెండు నెలల పాటు వేచి ఉంటే కానీ ఒక ప్రోటోటైప్ తయారు కాదు.

అయితే ఇప్పుడు టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కేవలం ఒక రోజులోనే 12 లేయర్ల పీసీబీ ప్రోటోటైప్‌ను తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది. క్వాల్‌కామ్‌తో ఒప్పందం కారణంగా 12 లేయర్ల పీసీబీ అత్యంత తక్కువ సమయంలో ఫ్యాబ్రికేట్ చేయడానికి వీలుంటుందని టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి తెలిపారు. ఎలక్ట్రినిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణను ఒక హబ్‌గా మారేందుకు ఇదొక సదవకాశమని అన్నారు. పీసీబీ ప్రోటోటైప్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం వల్ల.. చాలా మంది యువ పారిశ్రామికవేత్తలకు హై టెక్నాలజీ ప్రొడక్డ్స్ రూపొందించడం సులువుగా మారుతుందని చెప్పారు.

సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఏమి అవసరమో మాకు తెలసని, అలాంటి వారి కోసమే ఈ ప్రోటోటైప్ సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు క్వాల్‌కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశి రెడ్డి చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫెసిలిటీలో అనేక రకాల ఉత్పత్తులకు ప్రోటోటైప్ పీసీబీలు తయారు చేసుకోవచ్చని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్, మెడికల్ డివైజెస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటికి ఇది సహాయకారిగా ఉంటుందన్నారు.

ఎవరైనా ఒకరు తమ డిజైన్ తీసుకొని ఇక్కడకు వస్తే.. ప్రోటోటైప్ పీసీబీ ప్రింట్ చేసి ఇస్తామని చెప్పారు. ఒక వేళ ఎవరికైన కేవలం ఆలోచన మాత్రమే ఉంటే.. ఇక్కడ ఉండే ఉద్యోగులే డిజైన్, ఫ్యాబ్రికేట్, అసెంబుల్ చేసి.. ఆ తర్వాత వారి ప్రొడక్ట్స్‌లో ఆ పీసీబీని టెస్ట్ చేసి ఇస్తారని టీ-వర్క్స్ సీఈవో సుజయ్ వివరించారు.

First Published:  1 April 2023 8:16 AM IST
Next Story