Telugu Global
Telangana

ఒత్తిడితో బీజేపీలోకి.. సైదిరెడ్డి వాయిస్ రికార్డ్ వైరల్

ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడున్న పెద్దలు కండువా కప్పుకోవాలన్నారని, ఎంపీ టికెట్ ఖరారు చేశామన్నారని చెప్పారు సైదిరెడ్డి. కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తెలియజేస్తానని తాను చెబుతున్నా వారు వినిపించుకోలేదని, ఒత్తిడి తెచ్చారని అన్నారు.

ఒత్తిడితో బీజేపీలోకి.. సైదిరెడ్డి వాయిస్ రికార్డ్ వైరల్
X

ఇటీవల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన నలుగురు ముఖ్య నేతల్లో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఒకరు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన ఆయన ఇప్పుడు బీజేపీలో చేరారు. నల్గొండ లోక్ సభ టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ని వీడిన తర్వాత తొలిసారి ఆయన తన అనుచరులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హడావిడిగా ఎందుకు బీజేపీలో చేరాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఒత్తిడి తెచ్చారు..

రాజకీయ జీవితాన్నిచ్చిన బీఆర్ఎస్ ను వీడి సైదిరెడ్డి బీజేపీలో చేరడం చాలామంది అనుచరులకు ఇష్టం లేదు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆయనపై రగిలిపోతున్నారు. వారికి సర్దిచెప్పేందుకు సైదిరెడ్డి ప్రయత్నించారు. తనకు తాను బీజేపీలోకి వెళ్లలేదని ఢిల్లీనుంచి తనకు ఆహ్వానం అందిందని చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీకి చేరుకున్న తర్వాత జరిగిన తతంగంలో కూడా తన ప్రమేయం లేదంటున్నారు సైదిరెడ్డి. ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడున్న పెద్దలు కండువా కప్పుకోవాలన్నారని, ఎంపీ టికెట్ ఖరారు చేశామన్నారని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తెలియజేస్తానని తాను చెబుతున్నా వారు వినిపించుకోలేదని, ఒత్తిడి తెచ్చారని అన్నారు సైదిరెడ్డి. అప్పటికప్పుడు తాను కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. అలా తాను బీజేపీ కండువా కప్పుకున్నానని వివరించారు సైదిరెడ్డి.

క్షమించండి..

నాయకులెవరైనా పార్టీ మారుతుంటే నాలుగైదు రోజుల ముందునుంచే హడావిడి మొదలవుతుంది. స్థానికంగా కార్యకర్తల సమావేశాలు, అలకలు, బుజ్జగింపులు, చివరకు కండువా కప్పుకోవడం.. ఇలా జరుగుతుంది ఈ వ్యవహారం. కానీ ఇక్కడ సైదిరెడ్డి సడన్ గా ఢిల్లీకి వెళ్లారు, బీజేపీ కండువా కప్పుకొని వచ్చారు. దీంతో స్థానిక నేతలు, ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడిన సైదిరెడ్డి తనని క్షమించాలని కోరారు. వారంతా తన వెంట ఉంటారనే నమ్మకంతోనే పార్టీ మారానని, తనను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్న తరుణంలో రేపు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చే అవకాశముందని, మోదీ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడని, అందుకే బీజేపీలో చేరానని చెప్పుకొచ్చారు సైదిరెడ్డి. ఆయన మాటలతో కూడిన వాయిస్ రికార్డ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  13 March 2024 9:11 AM IST
Next Story