రంగంలో స్వర్ణలత ఏం చెప్పారంటే..?
భవిష్యవాణి వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా రంగం కార్యక్రమం ముగిసింది. రంగంలో భవిష్యవాణి వినిపించారు జోగిని స్వర్ణలత. వచ్చే ఏడాది ఎలా ఉంటుందనే విషయాన్ని ఆమె వివరించారు. భవిష్యవాణి వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.
"ఈ ఏడాది పూజలను ఎలాంటి లోపం లేకుండా సంతోషంగా అందుకున్నాను. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటాను. వర్షాలు వస్తాయి కానీ కొంచెం ఒడుదొడుకులు ఎదురవుతాయి. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. నా వద్దకు వచ్చిన ప్రజలను సుఖసంతోషాలతో చూసుకునే భారాన్ని మోస్తాను. ఐదు వారాల పాటు నాకు నైవేద్యం పెట్టాలి, టెంకాయలు కొట్టాలి. ప్రతి గడపను కాపాడే బాధ్యత నాదే. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ కడుపులో దాచుకొనేది నేనే. తప్పనిసరిగా నాలోనే దాచుకొంటాను. మీరు చేసే పూజలు అందుకుంటాను. వచ్చే ఏడాది అన్ని పూజలు జరిపించండి." అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమం ముగిసిన అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు మొదలవుతుంది. పోతరాజుల విన్యాసాలు ఉంటాయి. సాయంత్రం పొట్టేళ్లతో ఫలహారం బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. రంగం సందర్భంగా అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.