Telugu Global
Telangana

ఎన్నికలైపోయినా ఆగని జంపింగ్ లు.. కాంగ్రెస్ లోకి స్వామిగౌడ్

కాంగ్రెస్ ని నమ్ముకున్న అద్దంకి దయాకర్ వంటి నేతల పరిస్థితే అగమ్యగోచరంగా ఉన్న ఈ టైమ్ లో హస్తం పార్టీలోకి వచ్చి ఏం సాధిస్తారంటూ స్వామిగౌడ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ఎన్నికలైపోయినా ఆగని జంపింగ్ లు.. కాంగ్రెస్ లోకి స్వామిగౌడ్
X

మాజీ ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మళ్లీ కండువా మార్చేస్తున్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో స్వామి గౌడ్ తో అల్పాహార సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఏహామీ ఇచ్చారో తెలిదు కానీ.. మొత్తానికి కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి స్వామిగౌడ్ రెడీ అయ్యారు.

ఎక్కడినుంచి ఎక్కడికి..?

టీఎన్జీవో నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్.. బీఆర్ఎస్ తో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత శాసన మండలి తొలి చైర్మన్ గా ఆయనకు కీలక పదవి అప్పగించారు కేసీఆర్. 2020లో ఆయన బీఆర్ఎస్ ని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ కూడా ఆయన ఉండలేకపోయారు. 2022లో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్ గురించి పునరాలోచించారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల ముందు చాలామంది నాయకులు కండువాలు మార్చేశారు. టికెట్ దొరకని ఆశావహులు పక్క పార్టీలోకి వచ్చి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నికల తర్వాత మాత్రం నెలరోజులకు పైగా కండువాల పండగకు విరామం వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆ సీజన్ మొదలైనట్టుంది. స్వామిగౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ని నమ్ముకున్న అద్దంకి దయాకర్ వంటి నేతల పరిస్థితే అగమ్యగోచరంగా ఉన్న ఈ టైమ్ లో హస్తం పార్టీలోకి వచ్చి ఏం సాధిస్తారంటూ స్వామిగౌడ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

First Published:  18 Jan 2024 12:07 PM IST
Next Story