Telugu Global
Telangana

తెలంగాణకు స్వచ్ఛ అవార్డుల పంట..

త్రీ స్టార్ విభాగంలో సిద్ధిపేట, జ‌గిత్యాల జిల్లాలు దేశంలో 1, 2 స్థానాల్లో నిలిచాయి. ఫోర్ స్టార్ విభాగంలో తెలంగాణ‌లోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, పెద్దపల్లి జిల్లాకు మూడో స్థానం దక్కింది.

తెలంగాణకు స్వచ్ఛ అవార్డుల పంట..
X

స్వ‌చ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మ‌రోసారి తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలబడింది. త్రీ స్టార్, ఫోర్ స్టార్ విభాగాల్లో నాలుగు స్థానాల్లో మూడు తెలంగాణ‌కే దక్కడం విశేషం. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ గ్రామీణ 2023 అవార్డుల‌ను కేంద్రం ప్రకటించగా.. అక్టోబ‌ర్ - డిసెంబ‌ర్ క్వార్ట‌ర్ లో తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచింది. సీఎం కేసీఆర్ చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌థ‌కం ప్ర‌గ‌తి ఫ‌లాలే ఈ అవార్డులు అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నిధులివ్వకపోయినా అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ చురకలంటించారాయన.

స్వ‌చ్ఛ భార‌త్ సాకారంలో భాగంగా ప్ర‌తి మూడు నెల‌లకోసారి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ గ్రామీణ అవార్డులను కేంద్రం ప్రకటిస్తోంది. ఈ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో మొద‌టి 4 స్థానాల్లో 3 స్థానాలు ద‌క్కించుకుని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా తెలంగాణ నిలబడింది. త్రీ స్టార్ విభాగంలో సిద్ధిపేట, జ‌గిత్యాల జిల్లాలు దేశంలో 1, 2 స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేర‌ళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా నిలిచింది. ఫోర్ స్టార్ విభాగంలో తెలంగాణ‌లోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, పెద్దపల్లి జిల్లాకు మూడో స్థానం దక్కింది.

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల్లో ప్రతిసారీ తెలంగాణ మొద‌టి మూడు స్థానాల్లోనే నిలుస్తోంది. గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు వ‌స్తూనే ఉన్నాయి. అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్‌ మీనాక్షి మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచ్ కి ఈ అవార్డు ఇవ్వబోతున్నారు. ముఖరా కె గ్రామానికి గతంలో అనేక అవార్డులు వచ్చాయి. ఓడీఎఫ్ విభాగంలో కూడా దేశంలోనే ఆ గ్రామం నెంబర్-1 స్థానంలో ఉంది. ఈ ప్రత్యేకతలతోటే ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మహిళా దినోత్సవాన అవార్డు అందుకోబోతున్నారు.

First Published:  1 March 2023 7:47 AM IST
Next Story