39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై వేటు
సస్పెన్షన్ ఎత్తివేయాలని రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ పోలీసుల ఆందోళనలు
ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టింది. దీనిలోభాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ శాఖలో పనిచేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ చర్యలపై బెటాలియన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నల్గొండలోని 12 బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్లను అకారణంగా సస్పెండ్ చేశారని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్‌లోనూ పోలీసులు ధర్నా నిర్వహించారు. సస్పెన్షన్ ఎత్తివేసి, ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.