నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై సర్వే
రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుపై అధికారులకు మంత్రుల దిశానిర్దేశం
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు ప్రతిష్టాత్మక పథకాల కోసం సర్వే కొనసాగుతున్నది. ఇన్‌ఛార్జి మంత్రులు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారికి కులగణనలో నమోదు చేసుకోని వారికి కూడా పథకాల్లో అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల తీరుపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.
రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్తగా పథకాలు అమలు చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటాయని వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలపై దృష్టి సారించాలన్నారు. అలాంటప్పుడే అర్హులకు పథకాలు చేరుతాయన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించడం కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ సభల సమాచారం ప్రజాప్రతినిధులకు ఇచ్చి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వాములను చేయాలన్నారు.