బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టులో ఊరట
విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వడం, అందులోనూ ప్రత్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలు రావడంతో తెలంగాణలో రాజకీయ కలకలం రేగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ విఠల్ కు తాత్కాలిక ఊరట లభించినట్టయింది. ఈ కేసు విచారణను జులైకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
అసలేం జరిగింది..?
2022లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దండె విఠల్ పోటీ చేశారు ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చివర్లో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత విఠల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. నామినేషన్ తాను ఉపసంహరించుకోలేదని, తన సంతకాన్ని విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో విఠల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణను జులైకి వాయిదా వేసింది. విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వడం, అందులోనూ ప్రత్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలు రావడంతో తెలంగాణలో రాజకీయ కలకలం రేగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో దండె విఠల్ వర్గానికి ఊరట లభించినట్టయింది.