Telugu Global
Telangana

సునిల్ కనుగోలు తప్పుడు సర్వేలతో సీనియర్ కాంగ్రెస్‌ నాయకుల్లో అలజడి!

పదిహేను ఇరవై రోజుల క్రితం పార్టీలో చేరిన నాయకులకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇవ్వడంపై సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సునిల్ కనుగోలు తప్పుడు సర్వేలతో సీనియర్ కాంగ్రెస్‌ నాయకుల్లో అలజడి!
X

రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు సర్వేలనే నమ్ముకుంటున్నాయి. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అతీతం ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీ సర్వేలు అనగానే అందరికీ సునిల్ కనుగోలు గుర్తుకు వస్తారు. తెలంగాణ కాంగ్రెస్ కోసం ఆయన టీమ్ ఎప్పటి నుంచో సర్వేలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల గెలుపులో సునిల్ కనుగోలు పాత్ర ఉండటంతో.. ఇప్పడు అతడి మాటనే తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా పార్టీ నమ్ముతోంది. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునిల్ కనుగోలు సర్వేలను ఆధారం చేసుకోవడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సునిల్ కనుగోలు సర్వేలు చూస్తుంటే ఎవరికో ఫేవర్ చేసేలా ఉంటున్నాయని.. పదిహేను ఇరవై రోజుల క్రితం పార్టీలో చేరిన నాయకులకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇవ్వడంపై సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరి కొన్ని రోజులే అయినా.. వాళ్ల గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోయినట్లు చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునిల్ కనుగోలు టీమ్ ఇచ్చే రేటింగ్స్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అభ్యర్థులకు అతి తక్కువ సమయంలోనే 68 నుంచి 70 వరకు మార్కులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. సునిల్ కనుగోలు సర్వేల్లోని పారదర్శకత ఎంత మేరకు ఉందో, ఆయన ఉపయోగించే పద్దతులు ఏమిటో తెలియజేయాలని, సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన ఒక నాయకుడిపై గతంలోనే సర్వే చేసి అతనికి అత్యధిక రేటింగ్స్ ఇవ్వడంపై ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవలే పార్టీలో జాయిన్ అయిన వారికి టికెట్లు కేటాయించడంపై ఢిల్లీలోని స్క్రీనింగ్ కమిటీ చర్చిండపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీపై కూడా సదరు సీనియర్లు అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సునిల్ కనుగోలు సర్వే రిపోర్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

సునిల్ కనుగోలు టీమ్ ఇస్తున్న రిపోర్టుల్లో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులకు ప్రతికూల వాతావరణ కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణకు చెందిన ఏఐసీసీ సభ్యుడు ఒకరు ఇదే విషయంపై ఏకంగా సునిల్ కనుగోలుకు కాల్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, బలమైన సామాజిక వర్గం, అనుచరులు కలిగి ఉన్న వ్యక్తికి కాకుండా వేరే అభ్యర్థికి 70 శాతం రేటింగ్స్ ఎలా ఇస్తారంటూ గట్టిగానే అడిగినట్లు సమాచారం. సునిల్ కనుగోలు సర్వేలనే నమ్మి టికెట్లు కేటాయిస్తే.. తాను అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనని కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా సునిల్ కనుగోలు సర్వే రిపోర్టులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరీంనగర్, మహేశ్వరం, పాలకుర్తికి సంబంధించి సునిల్ టీమ్ ఇచ్చిన రిపోర్టు సక్రమంగా లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆఖరి రోజే కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి పార్టీలో చేరారు. ఆయనకు 68 శాతం రేటింగ్ సునిల్ టీమ్ ఇచ్చింది. అసలు ఏ పద్దతిలో సదరు వ్యక్తికి అంత రేటింగ్ ఇచ్చారంటూ సీనియర్ నాయకుడు ప్రశ్నిస్తున్నారు. సునిల్ టీమ్ చేసే సర్వేల్లో పారదర్శకత లోపించిందనే అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.

సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సునిల్ టీమ్‌పై అనుమానంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రతిష్టను అణగదొక్కి సునిల్ టీమ్ తప్పుడు రిపోర్టులు ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ రిపోర్టులపై గుర్రుగా ఉన్న కొంత మంది సీనియర్లు సునిల్ కనుగోలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ కావాలనే సర్వే రిపోర్టులను అనుకూలంగా మార్చుకొని టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారుతుందని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ప్యారాచ్యూట్ లీడర్లను కూడా టికెట్ల లిస్టులో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. గత రెండు మూడు నెలల్లో పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన డిక్లరేషన్లపై మంచి చర్చ జరుగుతున్నది. ఈ మధ్య పార్టీ గ్రాఫ్ కూడా బాగా పెరిగిందని సీనియర్ లీడర్లు అంటున్నారు. ఇలాంటి సమయంలో సునిల్ కనుగోలు టీమ్ కాంగ్రెస్ పార్టీ సత్తాను పక్కన పెట్టి.. ప్యారాచ్యూట్ లీడర్లకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు బీసీ నాయకులు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సునిల్ కనుగోలు టీమ్ కొన్ని ప్రాంతాలకు చెందిన బీసీ లీడర్ల విషయంలో తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొని వెళ్లాలని బీసీ నాయకులు నిర్ణయించారు.

First Published:  26 Sept 2023 10:34 AM IST
Next Story