ఎండాకాలం.. వంటగదిలో ఎక్కువసేపు ఉండొద్దు
శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా ఉన్నా, విపరీతమైన చెమట, దాహం వేయడంఎ, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు.
వేసవి కాలంలో బయట ఎక్కువగా తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇంటిలో ఉన్నవారు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఎండ వేడికి ఇంటిపట్టున ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవాలని. డీహైడ్రేషన్ కు గురిచేసే పనులు తక్కువగా చేయాలని చెబుతున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్జన్.. సలహాలు, సూచనలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ ప్రకటనలో సూచించారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలో పనిచేయడం, ఆటలాడటం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయొద్దన్నారు. పార్కింగ్ చేసిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలని.. ఎండ తీవ్రత ఎక్కువైతే ఉక్కపోతతో వారు ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందన్నారు.
వంటగదికి దూరంగా..
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు అధికారులు. వంట గదిలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, వంట చేస్తూ మహిళలు డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇంటిలో ఉన్నా కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా ఉన్నా, విపరీతమైన చెమట, దాహం వేయడంఎ, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని సూచించారు. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని, మద్యం, టీ, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు, అధికారులు.