Telugu Global
Telangana

సీఎం పిచ్చి నిర్ణయాలతో నేత కార్మికుల ఆత్మహత్యలు

వాళ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా కక్ష తీర్చుకుంటున్నడు : కేటీఆర్‌

సీఎం పిచ్చి నిర్ణయాలతో నేత కార్మికుల ఆత్మహత్యలు
X

సీఎం రేవంత్‌ రెడ్డి పిచ్చి నిర్ణయాలతో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులకు చేతినిండా పని కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక, స్కూల్‌ యూనిఫాంల ఆర్డులు ఇచ్చి ఆదుకుందని తెలిపారు. నేత కార్మికులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చిందని, నేత కార్మికులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, ప్రజలను నన్ను గెలిపించారన్న కోపంతో రేవంత్‌ రెడ్డి వాళ్లకు పని లేకుండా చేశారని మండిపడ్డారు. తాము సిరిసిల్లను మరో తిరుపూర్‌ చేయాలని అనుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నేత కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలు ఎందుకు బంద్‌ చేశారో చెప్పాలన్నారు. ఇప్పటి 22 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, పది నెలలుగా వారికి పని లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసి తెలియకుండా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడే మాటలకు నేతన్నలు ఆగం కావొద్దన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.3,312 కోట్ల పనులిస్తే రూ.250 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌ పెట్టామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు ఒక చీర ఇస్తే తాము రెండు చీరలు ఇస్తామన్న రేవంత్‌ రెడ్డి.. నేత కార్మికులకు ఎందుకు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం ఆగిన నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని.. సీఎం మనసు చలించడం లేదా అని ప్రశ్నించారు. అధికారమదంతో కాంగ్రెస్‌ లీడర్లు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని అన్నారు.

సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసిందే కేసీఆర్‌ అన్న సంగతి అధికారులు గుర్తు పెట్టుకోవాలని.. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలన్నారు. తనపై నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడని, అధికారిక కార్యక్రమాల్లో తమ ఫొటోలు పెట్టడం లేదని మండిపడ్డారు. మార్కెట్‌ కమిటీ పదవులు అమ్మకున్నారని కాంగ్రెస్‌ నాయకులే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామన్నారు. ఈ రోజు అతి చేస్తున్న వారికి మిత్తీతో సహా చెల్లిస్తామన్నారు. రేవంత్‌ రెడ్డిపై తనపై పగ ఉంటే తీర్చుకోవాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. కాంగ్రెస్‌ లీడర్లు ఎన్నో డైలాగులు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ అంటే ఏమిటో సీఎం చెప్పాలన్నారు. అర్హతలు లేని బావమరిది కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టడమేనా ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ అని ప్రశ్నించారు. 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా వాటిని చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామన్నారు. ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయామన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు అర్థమవుతున్నాయన్నారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు కానీ రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు.

కొదురుపాక అభివృద్ధికి కృషి చేస్తా

కొదురుపాక గ్రామ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని కేటీఆర్‌ అన్నారు. గురువారం తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మీబాయి, కేశవరావు స్మారకార్థం నిర్మించిన ప్రైమరీ స్కూల్‌ బిల్డింగ్‌ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ స్కూల్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొదురుపాక మిడ్‌ మానేరులో మునిగిపోవడం తననే ఎక్కువగా బాధకు గురి చేసిందన్నారు. ఈ ఊరితో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. తన నాన్నమ్మ ఊరు అప్పర్‌ మానేరులో, ఇంకో అమ్మమ్మ ఊరు లోయర్‌ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్‌ మానేరులో మునిగిపోయాయన్నారు. మూడు డ్యాముల్లో తమ కుటుంబానికి చెందిన ఊర్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. తమ ప్రభుత్వం నిర్వాసితులకు దాదాపు న్యాయం చేసిందని, ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే ప్రస్తుత ప్రభుత్వంతో మాట్లాడి అండగా నిలుస్తామన్నారు.

First Published:  26 Sept 2024 5:08 PM IST
Next Story