Telugu Global
Telangana

హైదరాబాద్ వాసులకు వేసవి నీటి కష్టాలు లేవు..

ప్రస్తుతం నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉండటంతో ఈ వేసవిలో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదంటున్నారు అధికారులు.

హైదరాబాద్ వాసులకు వేసవి నీటి కష్టాలు లేవు..
X

వేసవి వస్తుందంటే చాలు నగర వాసులకు నీటి కష్టాలు ఎదురవుతాయి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి సరఫరా అయ్యే నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. రోజు మార్చి రోజు, రెండ్రోజులకు ఓసారి, వారానికి ఓసారి.. ఇలా వేసవిలో నీటిని విడుదల చేసే కాలపరిమితి పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ నగరవాసులకు అనుభవంలోని విషయాలే. అయితే హైదరాబాద్ వాసులకు మాత్రం ఆ కష్టం లేదు. ఈ ఏడాది కూడా వేసవికి సరిపడా నీటి నిల్వలున్నట్టు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు ప్రకటించింది. మండు వేసవిలో ఊరటనిచ్చే వార్త చెప్పింది.

నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, అక్కడి నుంచి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా ఫేజ్ I, II, III పైప్ లైన్ల ద్వారా నగరానికి నీరు సరఫరా అవుతుంది. ప్రతి రోజూ 270 MGD (మిలియన్ గ్యాలెన్స్ పర్ డే ) నీరు నగరానికి సరఫరా అవుతుంది. నెలకు 1.38 టీఎంసీల నీరు నగరంలోని నీటి అవసరాలకు సరఫరా చేస్తారు అధికారులు. ఆ లెక్కన చూస్తే వేసవి ముగిసినా నగరవాసులకు నీటి ఇబ్బందులుండవు. ఆలోగా వర్షాలు పడితే అసలు ఎలాంటి కష్టాలు రావు.

ప్రస్తుతం నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉండటంతో ఈ వేసవిలో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో 156.11 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 188.95 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ వాసులకు తాగునీటి ఇబ్బంది ఉండదని మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు స్పష్టం చేసింది.

First Published:  21 April 2023 11:31 AM IST
Next Story