'దరిద్రానికి వడగండ్ల వానలా చేనేతపై జీఎస్టీ ఏంటి సార్'
చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలంటూ సుద్దాల అశోక్ తేజా, పద్మశ్రీ చింతకింది మలేశం లు ప్రధానమంత్రికి పోస్ట్ కార్డు రాశారు. ఈ జీఎస్టీ వల్ల పద్మశాలీల ఆత్మహత్యలు పెరుగుతాయని అశోక్ తేజా ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత పై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమంలో అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. టీఆరెస్ మంతృలు, ఎమ్మెల్యేలు, నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా చేనేత పై జీఎస్టీ ఎత్తివేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం లు కూడా ప్రధానికి పోస్ట్ కార్డులు రాశారు. జీఎస్టీ రద్దు చేసి చేనేతను రక్షించాలని వారు ప్రధానిని కోరారు.
ఈ సందర్భంగా అశోక్ తేజ ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన...తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, వాళ్ళ కోసం హాండ్లూమ్ పార్క్ లు ఏర్పాటు చేశారని , చేనేత చీరలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బతుకమ్మ చీరలుగా, రంజాన్ చీరలుగా ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే ''దరిద్రానికి వడగండ్ల వాన లాగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ జీఎస్టీ ఏంటి సార్ ?'' అని అశోక్ తేజా ప్రశ్నించారు. మీరు విధించిన ఈ జీఎస్టీ వల్ల పద్మశాలీల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ''మీరు చెప్పే 'సబ్కా వికాస్' లో పద్మశాలీలను కూడా భాగస్వాములను చేయడానికి జీఎస్టీని రద్దు చేయండి'' అని అశోక్ తేజా ప్రధానిని కోరారు.
చేనేత మీద జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి అని ప్రధానికి పోస్ట్ కార్డ్ రాసి విజ్ఞప్తి చేసిన జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ.
— Konatham Dileep (@KonathamDileep) October 24, 2022
మంత్రి @KTRTRS గారు ఇచ్చిన #RollbackHandloomGST పిలుపులో భాగంగా పోస్ట్ కార్డ్ రాశారు సుద్దాల అశోక్ తేజ గారు. pic.twitter.com/xE3h6UybMj
మరో వైపు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు. చేనేత పై జీఎస్టీ విధించడం వల్ల తాము ఉపాది కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
చేనేత మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వెంటనే తొలగించాలని మంత్రి @KTRTRS గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి @narendramodi గారికి పోస్ట్ కార్డ్ రాసిన పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు.#RollbackHandloomGST pic.twitter.com/wMBPvAoS5K
— Konatham Dileep (@KonathamDileep) October 24, 2022