Telugu Global
Telangana

సామాజిక సేవలో మేటి.. నేడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి

సగం జీతం చారిటీకోసం వినియోగించేవారు. తండ్రి పేరిట చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి తస్లీమా ఇప్పుడు ఏసీబీకి చిక్కారు. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు అధికారులు.

సామాజిక సేవలో మేటి.. నేడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి
X

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. తెలంగాణలో ఆమె ఓ సంచలన అధికారి. సోషల్ మీడియా స్టార్. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంతో మంది పేదలకు సహాయం చేశారు. ఆదివాసీల పిల్లలకు పౌష్టికాహారం, దుస్తులు సరఫరా చేస్తుంటారు. రోడ్లపై అనాథలుగా ఉన్నవారిని చేరదీసి వారిని ఆశ్రమాలకు చేర్చడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవారు. సగం జీతం చారిటీకోసం వినియోగించేవారు. తండ్రి పేరిట చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి తస్లీమా ఇప్పుడు ఏసీబీకి చిక్కారు. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు అధికారులు.

అసలేం జరిగింది..?

మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఇటీవల స్థలం రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా గజానికి రూ.200 లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు. గజానికి రూ.150 చొప్పున బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు హరీష్. ఆమెకు డబ్బులిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.19,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అదే ఆఫీస్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రూ.1.70 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

అందరూ షాక్..

సామాజిక సేవతో పాపులర్ అయిన తస్లీమా.. వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళ్తూ పిల్లలకు నీతి సూక్తులు చెప్పేవారు. కష్టపడి చదవాలని, తోటివారికి సాయపడాలని ఆమె ఉపన్యాసాలిచ్చేవారు. అలాంటి తస్లీమా ఏసీబీకి చిక్కారంటే ఎవరూ నమ్మలేదు. ఆవిడ ఈవిడేనా అని నిర్థారించుకున్న తర్వాత అవాక్కయ్యారు. సామాజిక సేవకురాలిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన తస్లీమా ఇప్పుడు అంతకంటే సెన్సేషన్ వార్తగా మారారు. తస్లీమాపై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం అసలు నిజం ఏమై ఉంటుందోనని ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు.

First Published:  22 March 2024 9:50 PM IST
Next Story