హైదరాబాద్, బెంగళూర్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం..
ఉప్పల్ స్టేడియం ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని AIYF, DIYF, PYL ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరఫ్ అనేది అందరికీ తెలిసిందే. HCAపై ఎప్పుడు చూసినా అవినీతి, బ్లాక్ టికెట్ల దందా ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని గతంలో పలుమార్లు ఆందోళనలు కూడా జరిగాయి. ఇక ఏప్రిల్ 25న ఉప్పల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను HCA బ్లాక్‌లో అమ్ముకుందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 30 నిమిషాల్లోనే 36వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 25న జరిగే మ్యాచ్‌ను అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.
అంతకుముందు ఉప్పల్ స్టేడియం ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని AIYF, DIYF, PYL ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. HCA ప్రెసిడెంట్‌కు వినతిపత్రం ఇవ్వడానికి స్టేడియంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.