Telugu Global
Telangana

అమెరికా రోడ్లపై దయనీయ స్థితిలో హైదరాబాద్ యువతి.. కేంద్రానికి లేఖ రాసిన తల్లి

హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన సయీద లూలూ మిన్హాజ్ జైదీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ చేయడం కోసం అప్లై చేసింది. అమెరికా డెట్రాయిట్‌లోని TRINE యూనివర్సిటీలో ఆమెకు ఎంఎస్ సీటు రావడంతో 2021లో వెళ్లింది.

అమెరికా రోడ్లపై దయనీయ స్థితిలో హైదరాబాద్ యువతి.. కేంద్రానికి లేఖ రాసిన తల్లి
X

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి.. అక్కడ రోడ్ల పక్కన దీన స్థితిలో కనపడటం కుటుంబానికి ఆందోళన కలిగించింది. 2021లో అమెరికా వెళ్లిన ఆ యువతి నిత్యం కుటుంబంతో టచ్‌లో ఉన్నది. కానీ నాలుగు నెలలుగా ఆమె నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో ఆందోళన చెందారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆమెను రోడ్డు పక్కన చూసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తల్లి గుర్తించింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన సయీద లూలూ మిన్హాజ్ జైదీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ చేయడం కోసం అప్లై చేసింది. అమెరికా డెట్రాయిట్‌లోని TRINE యూనివర్సిటీలో ఆమెకు ఎంఎస్ సీటు రావడంతో 2021లో వెళ్లింది. అప్పటి నుంచి తల్లితో రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ వస్తోంది. ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన లూలూ జైదీ ఫోన్ చేయడం మానేసింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే తోటి విద్యార్థులకు కాల్ చేయగా.. తన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని.. స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.

కాగా, విద్యార్థులు జైదీని ఆసుపత్రిలో చేర్పించినా.. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఎవరికీ కనపడలేదు. డెట్రాయిట్ నుంచి షికాగోకు వెళ్లిన జైదీ.. అక్కడే రోడ్లపై తిరుగుతూ.. ఎవరైనా పెడితే తింటూ జీవిస్తోంది. అక్కడే వీధుల్లో అడుక్కుంటూ.. రోడ్ల పక్కన ఉంటున్న జైదీని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు గమనించారు. ఆమె దీన స్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోను అమెరికాలోని హైదరాబాదీలతో పాటు జైదీ తోటి విద్యార్థులు చూశారు. ఆమె షికాగోలో ఉన్నదని తెలుసుకొని అక్కడే ఒక సురక్షిత ప్రాంతానికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.

లూలూ జైదీ దీన స్థితికి చెందిన వీడియోను హైదరాబాద్ ఎంబీటీ పార్టీ నాయకుడు అమ్‌జద్ ఉల్లా ఖాన్ స్పందించారు. ఆ విషయాన్ని మౌలాలిలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అంతే కాకుండా జైదీని తిరిగి ఇండియాకు తీసుకొని రావడానికి సహాయం చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ట్వీట్ చేశారు. జైదీ తల్లి వహాజ్ ఫాతిమా కూడా జైశంకర్‌కు లేఖ రాశారు. తన కూతురు ఎంఎస్ చదవడానికి వెళ్లి.. అక్కడ తీవ్రమైన మానసిక సమస్యతో ఆసుపత్రిలో చేరిందని.. ప్రస్తుతం దీన స్థితిలో అమెరికా రోడ్లపై కనపడగా.. స్థానికులు ఆదుకున్నారని తెలిపింది.

నగరానికి చెందిన ఇద్దరు యువకుల కారణంగా కూతురి విషయం తెలిసింది. ఆమెకు చెందిన వస్తువులు, డబ్బు కూడా ఎవరో దోచుకున్నారని పేర్కొన్నది. తన కూతురుకి సహాయం చేయాలని షికాగోలోని ఇండియన్ కాన్సులేట్, వాషింగ్టన్‌లో ఇండియన్ ఎంబసీకి ఆదేశాలు ఇవ్వాలని ఆమె లేఖలో కోరారు. కాగా, జైదీ తల్లి లేఖపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్ స్పందించింది. వాహెదా ఫిర్యాదును రిజిస్టర్ చేశామని.. మదత్ పోర్టల్‌లో నమోదు చేసి.. తదుపరి చర్యలకు ఆదేశించినట్లు తెలిపింది.


First Published:  27 July 2023 11:31 AM IST
Next Story