Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీలో ఇకపై కఠిన నిబంధనలు.. కసరత్తు చేస్తున్న కమిషన్ అధికారులు

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగంలో చేరే సమయంలోనే తాము భవిష్యత్‌లో కమిషన్ నిర్వహించే ఎలాంటి పోటీ పరిక్షలు రాయబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవాలని భావిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీలో ఇకపై కఠిన నిబంధనలు.. కసరత్తు చేస్తున్న కమిషన్ అధికారులు
X

టీఎస్‌పీఎస్సీలో ఇకపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా సరికొత్త సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టనున్నది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేయాలంటే.. భవిష్యత్‌లో కమిషన్ నిర్వహించే ఎలాంటి పోటీ పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా నిబంధన తీసుకొని రావడంపై కసరత్తు చేస్తోంది. ఇటీవల పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులు అందరూ కమిషన్‌లో ఉద్యోగం చేసే వారే అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగంలో చేరే సమయంలోనే తాము భవిష్యత్‌లో కమిషన్ నిర్వహించే ఎలాంటి పోటీ ప‌రీక్షలు రాయబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే కమిషన్ కాకుండా ఇతర నియామక సంస్థల పరీక్షలు రాయడానికి మాత్రం అనుమతి ఇవ్వనున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యే సమయంలో అభ్యర్థి బ్యాగ్రౌండ్ పూర్తిగా చెక్ చేయనున్నారు. గతంలో ఎక్కడ ఉద్యోగం చేశాడు..? అతని ప్రవర్తన ఎలా ఉన్నది..? క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా..? వంటి వివరాలను ఎంపిక దశలోనే పూర్తిగా పరిశీలించాలని నిర్ణయించారు.

టీఎస్‌పీఎస్సీ ఏర్పడి 9 ఏళ్లు పూర్తికావొస్తోంది. గతంలో ఏనాడూ ఇలా లీకేజీ ఘటనలు చోటు చేసుకోలేదు. తొలిసారిగా ఇలాంటి వ్యవహారం బయటపడటంతో సరికొత్త సంస్కరణలు తీసుకొని రావాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, ప్రధాని నిందితుడు రాజశేఖర్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. కార్యాలయంలో అంతర్గత బదిలీలు కూడా చేశారు.

అయితే, కమిషన్ ఉద్యోగులు పోటీ పరీక్షలు రాయకుండా హామీ తీసుకోవాలనే విషయంపై అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వెలుడుతున్నాయి. అలా కాకుండా.. టీఎస్‌పీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లలో ఏదైనా ఉద్యోగ పరీక్ష రాయాలని అనుకుంటే.. ముందస్తుగా కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని రూల్ మారిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పరీక్ష తేదీకి మూడు నెలల నుంచి ఫలితాలు వెలువడిన తర్వాత నెల రోజుల వరకు సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లేలా నిబంధనలు మార్చాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా కమిషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని, అలాగే అండర్ టేకింగ్ ఇచ్చి వెళ్లాలని భావిస్తున్నారు.

ఇక సెలవులో వెళ్లిన ఉద్యోగి.. ఉద్యోగ ప్రిపరేషన్ సమయంలో బయటి వ్యక్తులను కలవకూడదనే నిబంధన కూడా విధించనున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే.. ముందు కమిషన్ ఉద్యోగానికి రిజైన్ చేసేలా నిబంధన తీసుకొని రానున్నారు. దీంతో పాటు కార్యాలయానికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు రూపొందించారు. టీఎస్‌పీఎస్సీలోకి విజిటర్స్‌ను అనుమతించకూడదని భావిస్తున్నారు. ఎవరైనా దరఖాస్తు చేయడానికి వస్తే.. హెల్ప్ డెస్క్‌లో వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోవాలి. అంతే కానీ కమిషన్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడాని వీల్లేదు.

అధికారికంగా ఎవరినైనా కలవాలంటే ముందుగా సెక్రటరీ లేదా చైర్మన్‌ల అనుమతి తీసుకోవాలి. తమ పూర్తి వివరాలు సెక్యూరిటీకి ఇవ్వాలి. సెక్యూరిటీ సిబ్బందే సదరు వ్యక్తిని కలవాల్సిన అధికారి దగ్గరకు తీసుకొని వెళ్లి.. తిరిగి బయటకు తీసుకొని వస్తారు. అంతే కాకుండా ఏ సెక్షన్‌లో ఉద్యోగులు అదే సెక్షన్‌లో మాత్రమే ఉండాలి. ఇతర సెక్షన్లకు తిరిగేందుకు అనుమతి ఇవ్వరు. కారుణ్య నియామకాల ద్వారా టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగాలు పొందడంపై కూడా నియంత్రణ విధించే అవకాశం ఉన్నది. ఈ నిబంధనలు అన్నీ రూపొందించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపుతారు. ఆ తర్వాత అవి అమలులోకి రానున్నాయి.

First Published:  24 March 2023 9:40 AM IST
Next Story