Telugu Global
Telangana

వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న విపక్షాలకు సీఎం వార్నింగ్‌

వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు
X

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులపాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గురుకులాలను తరుచు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పోషకాహారం అందజేయాలని సూచించారు. హాస్టళ్లలో తరుచూ కలుషితాహార ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం రేవంత్‌ మండిపడ్డారు.

విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి డైట్‌ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని, అలాంటి వారిపై కలెక్టర్లు వేటు వేయాలన్నారు. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలిగించడానికి వెనుకాడబోమని సీఎం హెచ్చరించారు.

రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక కలుషిత ఆహారం, హాస్టళ్లలో సరైన వసతుల లేక అనారోగ్యాల బారిన పడి 40కి పైగా విద్యార్థులు మృతి చెందారు. హైకోర్టు కూడా విద్యార్థుల మరణాలపై సీరియస్‌ అయ్యింది. విద్యాశాఖ తన వద్దే పెట్టకున్న సీఎం దీనికి బాధ్యత వహించాలి. కానీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న విపక్షాలకు వార్నింగ్‌ ఇచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో విద్యార్థుల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు చనిపోతే గాని ప్రభుత్వం స్పందించదా? అని హైకోర్టు కూడా ప్రభుత్వ న్యాయవాదిపై సీరియస్‌ అయ్యింది. వారం రోజుల్లోగా కౌంటర్‌ వేస్తామన్న అంశంపై మండిపడింది. ఇంత జరిగినా సీఎం తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నట్లు, కొందరు కావాలనే తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం దేనికి సంకేతం?

First Published:  28 Nov 2024 12:31 PM IST
Next Story