Telugu Global
Telangana

ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. కీలక మార్గదర్శకాలు విడుదల

ఆయా ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు వచ్చే పేషెంట్ లోడ్‌కు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించే ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. కీలక మార్గదర్శకాలు విడుదల
X

ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా సీఎం కేసీఆర్ ఆరోగ్య రంగానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 40 కొత్త మండలాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి.. ఆ శాఖ పరిధిలో మానవ వనరులను హేతుబద్ధీకరణ చేయడానికి చర్యలు చేపట్టింది.

ఆయా ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు వచ్చే పేషెంట్ లోడ్‌కు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఏర్పాటు చేసిన కమిటీ.. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ విభాగాన్ని బలోపేతం చేయడానికి పలు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి ఒక జీవోను విడుదల చేసింది.

కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉండగా.. ఇకపై అదనంగా ఐదు పోస్టులను జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు కొత్త డీఎంహెచ్‌వోలు రానున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో డీఎంహెచ్‌వోల సంఖ్య ఆరకు, రాష్ట్రంలో 38కి చేరుకోనున్నది.

కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 636 పీహెచ్‌సీల్లో ఏకరీతిలో సిబ్బంది ఉండేలా పునర్వవస్థీకరించనున్నారు. గతంలో 30 మండలాల పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో కొత్తగా ఔట్ రీచ్ కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు 30 పీహెచ్‌సీలను మంజూరు చేశారు.

తెలంగాణలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల బలోపేతానికి తగినంత మంది సిబ్బందిని నియమించనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు ఇప్పటి వరకు లేవు. దీంతో డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ పరిధిలోకి తీసుకొని వస్తున్నట్లు జీవోలో పేర్కొన్నది.

1,712 పోస్టులను సూపర్ న్యూమరీగా మార్చింది. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ-ఎఫ్) కేడర్‌ను ఇంకా హేతుబద్ధీకరణ చేయలేదు. దీంతో పీహెచ్‌సీ, ఇతర సంస్థల్లో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ పోస్టుల స్థానాలను మార్చలేదని తెలిపింది. హేతుబద్ధీకరణ సమయంలో పేషెంట్ లోడ్‌కు అనుగుణంగా ఇతర సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.

First Published:  25 Aug 2023 5:50 AM IST
Next Story