Telugu Global
Telangana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా కూటమి..!

ఖమ్మం జిల్లాలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ ర్యాలీలు, సభల్లో తెలుగుదేశం జెండాల‌తో ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున కనిపిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా కూటమి..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం.. ఈసారి ఎవరికి మద్దతు ప్రకటించలేదు. మొదట జనసేన-తెలుగుదేశం కూట‌మిగా పోటీచేస్తుంద‌ని ప్రచారం జరిగినప్పటికీ.. అది ఆచరణలోకి రాలేదు. జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుండగా.. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించింది. అయితే ఆ పార్టీ ఇప్పుడు అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. ఈ విషయం ఖమ్మం జిల్లా రాజకీయాలను చూస్తే స్పష్టంగా అర్థ‌మవుతోంది.



ఖమ్మం జిల్లాలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ ర్యాలీలు, సభల్లో తెలుగుదేశం జెండాల‌తో ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేనప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ నేతలు ముందుండి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల ఏకంగా పసుపు కండువా తన మెడలో వేసుకుని తిరుగుతున్నారు. ఇక సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ర్యాలీల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు కనిపించడం విశేషం.



2018లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ.. మహా కూటమి పేరిట తెలంగాణలో పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశాయి. అయితే ఖమ్మం జిల్లాలో ఈ సారి కూడా ఇదే సీన్‌ కనిపిస్తోంది. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తులో పోటీ చేస్తుండగా.. తెలంగాణ జనసమితి బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా టీడీపీ నుంచి వచ్చిన నేత కావడం.. ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తుండటంతో.. వారి గెలుపు కోసం తెలుగుదేశం తాపత్రయ పడుతోంది. కాగా, 2018తో పోల్చితే ఖమ్మం జిల్లాలో ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.

First Published:  14 Nov 2023 11:06 AM IST
Next Story