Telugu Global
Telangana

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు ఆపండి.. ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఈసీ లేదంటూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెల్లం నరేశ్, ములుగు జిల్లాకు చెందిన బూర లక్ష్మీనారాయణ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు ఆపండి.. ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు
X

గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు పనులను నిలిపి వేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద సీతమ్మసాగర్ పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఎలాంటి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (ఈసీ) లేకుండానే పనులు చేపడుతున్నారని ఇద్దరు వ్యక్తులు ఎన్టీటీ దక్షిణాది బెంచ్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఈసీ లేదంటూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెల్లం నరేశ్, ములుగు జిల్లాకు చెందిన బూర లక్ష్మీనారాయణ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ)-2006 నోటిఫికేషన్ ప్రకారం అక్కడ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వారు పేర్కొన్నారు. అయితే 2022 ఫిబ్రవరి 24న చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం రికార్డులు సమర్పించిందని.. ఆనాడే అక్కడ ఈసీ లేకుండా నిర్మాణం జరపబోమని ఎన్జీటీకి తెలిపినట్లు పేర్కొంది.

ఈసీ క్లియరెన్స్ లేకుండా ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకొని వెళ్లవద్దని ఎన్జీటీ ఆదేశించింది. ఈఐఏ అధ్యయనం, పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా పనులు కొనసాగించద్దని ఎన్జీటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు నది మీద కడుతుంటమే కాకుండా.. ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన అనుమతులు తప్పకుండా సంబంధిత శాఖల నుంచి తీసుకోవాలని చెప్పింది. ఈ ప్రాజెక్టులో రెండు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయితే.. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని ఎన్జీటీ చెప్పింది.

తెలంగాణ సాగునీటి పారుదల శాఖ వెంటనే అవసరమైన అనుమతులు అన్నీ తీసుకొని.. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్జీటీ కోరింది. ఒక వేళ ఈసీ తీసుకొని ఉంటే.. ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్జీటీ తెలిపింది. అయితే ఆ ఈసీ ప్రతిని సమర్పించాలని కోరింది.

First Published:  30 March 2023 4:01 AM GMT
Next Story