Telugu Global
Telangana

హైడ్రామాలు బంద్‌ పెట్టి హైదరాబాద్‌ బాగుపడేలా చేయండి

బలిసినోళ్లకు ఒక న్యాయం.. పేదలకు ఇంకో న్యాయమా? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైడ్రామాలు బంద్‌ పెట్టి హైదరాబాద్‌ బాగుపడేలా చేయండి
X

హైడ్రా పేరుతో హైడ్రామాలు బంద్‌ పెట్టి హైదరాబాద్‌ బాగుపడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్మించిన సేవరేజీ ట్రీట్‌ మెంట్లను పరిశీలించిన అనంతరం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర ఎమ్మెల్యేలతో కలిసి కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా కూల్చివేతల్లో బలినోళ్లకు ఒక న్యాయం.. ఏమిలేని నిరుపేదలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ కు ఓట్లేసి గెలిపించారని.. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. వేద శ్రీ అనే పాపకు పుస్తకాలు తీసుకునే టైం ఇవ్వలేదని.. కుమారి అనే మహిళ చెప్పుల దుకాణం తొలగించారని, ఒక గర్భిణికి తన ఇంట్లో నుంచి సామాను తీసుకునే అవకాశం ఇవ్వలేదని, ఇలాంటి ఎన్నో హృదయ విదారక ఘటనలు హైడ్రా కూల్చివేతల సమయంలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఫుట్‌ పాత్‌లను ఆధారంగా చేసుకొని బతికే పేదలపై ఎందుకు కక్ష అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మానవీయత ఉండాలన్నారు. మూడు రోజుల క్రితం ఫీజులు తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేసిన ఇండ్లను కూల్చివేస్తున్నారని.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్‌ నడుపుతున్నారా అని ప్రశ్నించారు.

బఫర్‌ జోన్‌ లో నిర్మాణాలు అనుమతులు ఇచ్చిన వాళ్లను బాధ్యులను చేయాలన్నారు. ఇండ్లు కూల్చిసిన బాధితులు పడుతున్న బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు. హైడ్రా బాధితులకు పార్టీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందన్నారు. బాధితులు పార్టీ ఎమ్మెల్యేలు, లేదా తెలంగాణ భవన్‌ లో సంప్రదించాలని సూచించారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కట్టలేదని చెప్పినోళ్లు ఇప్పుడు మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూంలు ఇస్తామని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీతో పాటు సమీప ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల కోసం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎండీఏకు చెందిన వెయ్యి ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ఆ భూములు అమ్మే పైసలు నగరంలోని పేదల కోసం ఖర్చు చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇలాగే కొనసాగితే వాళ్ల బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతామన్నారు. ఆక్రమణలు జరిగింది.. వాటిలో నిర్మాణాలకు పర్మిషన్‌ లు ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఆక్రమణలు ప్రోత్సహించలేదన్నారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ఆఫీస్‌, సీఎం రేవంత్‌ అన్న ఇల్లు.. అన్నీ నాలాలు, బఫర్‌ జోన్‌లలోనే ఉన్నాయని తెలిపారు. మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ఫాం హౌస్‌ లు బఫర్‌ జోన్‌ లో ఉన్నాయని, రేవంత్‌ కు చిత్తశుద్ధి ఉంటే ముందు వాటిని కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ పై రేవంత్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారని.. ఒకసారి రూ.50 వేల కోట్లు.. మరోసారి రూ.75 వేల కోట్లు.. ఇంకోసారి రూ.1.50 లక్షల కోట్లు అంటున్నారని గుర్తుచేశారు. అసలు ఆ ప్రాజెక్టుకు డీపీఆర్‌ సిద్ధం చేశారా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మూసీపై ఎస్టీపీలు నిర్మించామని.. అలాంటప్పుడు నిర్మాణ వ్యయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. బ్లాక్‌ లిస్ట్‌ లో ఉన్న పాకిస్థాన్‌ కంపెనీకి కాంట్రాక్ట్‌ కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ వివరాలను త్వరలోనే బయట పెడుతామన్నారు. తమ ప్రభుత్వం చెరువులను ఎలా కాపాడిందో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ 42 శాతానికి పడిపోయిందని వార్తలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ ను మురికినీటి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అప్పటి సీఎం కేసీఆర్‌ సంకల్పం తీసుకున్నారని, రూ.4 వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో పండుగలను ఎంతో అట్టహాసంగా నిర్వహించామని, అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ పెట్టుకుంటే రక్షణ కల్పించి ఆ కార్యక్రమం నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ గాడి తప్పిందని, క్రైం రేట్‌ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  25 Sept 2024 2:23 PM IST
Next Story