బీజేపీ ఎంపీ అరవింద్ కు షాక్... గ్రామస్తుల దాడి
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నడూ ప్రయత్నించలేదని, గెలిచాక ఒక్క సారి కూడా తమ గ్రామానికి రాలేదని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎరదండి గ్రామస్తులు అరవింద్ ను అడ్డుకున్నారు.

ఎరదండి సమీపంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించేందుకు అరవింద్ శుక్రవారం ఆ గ్రామానికి వెళ్ళారు. ఆసమయంలో గ్రామస్తులు ఆయనను ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎంతో కాలంగా ఉన్న భూమి సమస్యను, ఇతర అనేక సమస్యలను పరిష్కరించలేదని, ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, అసలు గెలిచాక ఒక్క సారి కూడా గ్రామానికి రాలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు అరవింద్ ను ఘెరావ్ చేశారు.దీంతో పోలీసులు కల్పించుకొని అరవింద్ ను నిరసనకారుల బారి నుండి కాపాడి తీసుకెళ్ళారు. అయితే అరవింద్ గోదావరి ముంపు ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తిరిగి గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఆ సమయంలో అరవింద్ తో పాటు వచ్చిన బీజెపి కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగారని స్థానికులు ఆరోపించారు. దాంతో అక్కడ ఒక్క సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు 'అరవింద్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేయడంతో ఆయన అనుచరులు కూడా గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. ఓ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు అరవింద్ కాన్వాయ్ పై రాళ్ళతో దాడికి దిగారు. కాన్వాయ్ లోని రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. చివరకు పోలీసులు గ్రామస్తులను శాంతింపచేసి అరవింద్ ను అక్కడి నుంచి పంపించివేశారు.