Telugu Global
Telangana

రైళ్లపై రాళ్లు.. ఐదేళ్లు జైలు

వందేభారత్ పై ఇటీవల జరిగిన 9 దాడుల వివరాలు, అరెస్ట్ చేసినవారిపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైళ్లపై రాళ్లు.. ఐదేళ్లు జైలు
X

ఆందోళనలు, అల్లర్ల సమయంలో రైల్వే ఆస్తులకు భంగం కలిగిస్తే ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. రైల్వే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే సందర్భానుసారం కేసులు పెట్టే విషయంలో రైల్వే అధికారులు ఉదారంగా ఉంటే మాత్రం తప్పు చేసినవారు కూడా తప్పించుకుంటారు. కానీ ఇకపై ఇలాంటివేవీ కుదరవంటున్నారు రైల్వే అధికారులు. రైళ్లపై రాళ్లు వేసినా సరే కఠిన శిక్షలు అమలు చేస్తామంటున్నారు.

సాధారణ రైళ్లపై రాళ్లు వేస్తే ఆస్తి నష్టం పెద్దగా జరగదు, ప్రయాణికులకు రాళ్లు తగిలితే మాత్రం కష్టమే. ఇప్పుడు వందే భారత్ సీజన్ నడుస్తోంది. మొత్తం అద్దాలతో ఉండే ఆ రైలుపై రాయి పడితే మాత్రం ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. పైగా అది రైల్వేకి ప్రెస్టేజ్ ఇష్యూ. అసలే ఆవుల్ని, గేదెల్ని ఢీకొంటూ నిత్యం వందే భారత్ వార్తల్లో రైలుగా మారింది. పదే పదే రాళ్లదాడి ఘటనలు కూడా వెలుగులోకి రావడం, అద్దాలు పగలడంతో వందే భారత్ విషయంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రాళ్లు రువ్వే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తోంది. రైళ్లపై రాళ్లు విసిరితే రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఇటీవల ఖాజీపేట-ఖమ్మం, ఖాజీపేట- భువనగిరి, ఏలూరు - రాజమండ్రి మధ్య వందే భారత్ పై రాళ్లదాడులు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 9 ఘటనలు జరిగాయి. ఫలితంగా ట్రైన్ రీషెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులంతా అసౌకర్యానికి గురయ్యారు. ఈ దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి ప్రాణాపాయం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు విశాఖలో ఆగిఉన్న రైలుపై కూడా రాళ్లు విసిరారు. ఈ దాడిలో రెండు కోచ్‌ ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆకతాయిలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు కారణమైన 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపింది. కొన్ని దాడుల ఘటనల్లో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలను ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తల్లిదండ్రులే చొరవతీసుకుని మందలించాలని రైల్వేశాఖ కోరింది. ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌ల తో రైల్వే శాఖ సమన్వయం చేసుకుంటోంది. రాళ్లు రువ్వే ప్రమాద స్థలాలన్నింటిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని పహారా పెట్టింది.

త్వరలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి కూడా వందేభారత్ సర్వీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వందేభారత్ పై ఇటీవల జరిగిన 9 దాడుల వివరాలు, అరెస్ట్ చేసినవారిపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First Published:  29 March 2023 9:48 AM IST
Next Story