వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. ఈసారి ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పందిళ్ళపల్లి స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. అయితే ఈ సంఘటన నిన్న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాళ్ల దాడిలో రైలులోని సీ12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఖమ్మం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. వందే భారత్ రైళ్లను ప్రభుత్వం ఏ క్షణాన మొదలుపెట్టిందో కానీ ఆ రైళ్లపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టగా ఇవి దేశవ్యాప్తంగా పలుమార్గాల్లో నడుస్తున్నాయి. అయితే వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రతి చోట రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి జరిగింది. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పందిళ్ళపల్లి స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. అయితే ఈ సంఘటన నిన్న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాళ్ల దాడిలో రైలులోని సీ12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.
రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్‌ను విశాఖపట్నం స్టేషన్లో మార్చారు. దీని వల్ల రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇవాళ ఉదయం 5:45 గంటలకు రైలు బయలుదేరాల్సి ఉండగా 8.50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరింది.
ఇటీవలే సికింద్రాబాద్ - విశాఖ నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముందు ఈ రైలు ట్రయల్ రన్ కోసం విశాఖపట్నం చేరుకోగా, కంచరపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసరడంతో రెండు బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మరోసారి వందే భారత్ రైలుపై రాళ్లు విసిరారు. కాగా రైలుపై రాళ్ల దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న రైల్వే అధికారులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.