ఈ రైలుకోసం మోదీ.. ఆ రైలుపై రాళ్లదాడి
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. పనితీరుకంటే ప్రమాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నంకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల్లో మరో ఎక్స్ ప్రెస్ ని ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వస్తున్నారు మోదీ. ఈ రైలుకోసం ఆయన వస్తుండగా, ఆ రైలుపై ఇప్పుడు రాళ్లదాడి కలకలం రేపింది. అయితే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఖమ్మం జిల్లాలో రాళ్లదాడి జరిగింది, ఇప్పుడు రెండోసారి అదే రైలుపై రాళ్లుపడ్డాయి, అద్దాలు పగిలాయి. మరమ్మతులు చేయడం కోసం రైలు టైమింగ్స్ మార్చేశారు.
వందేభారత్ అంటేనే..!!
గతంలో కూడా పలు రైళ్లపై రాళ్లదాడి ఘటనలు జరిగినా.. వాటికి అద్దాలు తక్కువగా ఉండటం, అద్దాల చుట్టూ ఇనుప కమ్మీలతో రక్షణ ఉండటంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేది. కానీ వందేభారత్ డిజైన్ పూర్తిగా వేరు. దీనిపై రాయి పడితే అద్దం ముక్కలవుతుంది. ఏదైనా జంతువుని రైలు ఢీకొట్టినా ముందుభాగం సొట్టపడుతుంది. మరమ్మతులకు గంటల సమయం పడుతుంది. ఇలా ఇటీవల కాలంలో వందేభారత్ రైలు ప్రతిరోజూ వార్తల్లోకెక్కుతోంది. జంతువులను ఢీకొనడం, రాళ్లదాడి.. ప్రతిరోజూ ఏదో ఒకటి ఎక్కడో ఓచోట జరగాల్సిందే. అందులోనూ సికింద్రాబాద్-విశాఖ రైలుపై వరుసగా రెండుసార్లు రాళ్లదాడి జరగడం విశేషం.
ప్రస్తుతం జరిగిన రాళ్లదాడిలో సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల కోసం విశాఖలో రైలుని ఆపేశారు. 4గంటలు ఆలస్యంగా షెడ్యూల్ వేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రైలుతోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు, ఇక రెండో రైలుని అట్టహాసంగా ప్రారంభించేందుకు మోదీ హైదరాబాద్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. పనితీరుకంటే ప్రమాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.