Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీలో క్యాష్‌లెస్ దిశగా అడుగులు.. కండక్టర్లకు ఐ-టిమ్స్ డివైజ్‌లు

ఆండ్రాయిడ్ బేస్డ్‌గా పని చేసే ఈ డివైజ్‌లను పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరంలో పరిశీలించనున్నది.

టీఎస్ఆర్టీసీలో క్యాష్‌లెస్ దిశగా అడుగులు.. కండక్టర్లకు ఐ-టిమ్స్ డివైజ్‌లు
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) క్యాష్‌లెస్ సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. టీఎస్ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌లకు కలిపి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇటీవలే మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మెట్రో, టీఎస్ఆర్టీసీ అధికారులతో సమావేశం కూడా నిర్వహించి.. ఎన్సీఎంసీ కార్డుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ క్రమంలో ఆ కార్డులను ఉపయోగించడానికి వీలుగా ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్)ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

ఆండ్రాయిడ్ బేస్డ్‌గా పని చేసే ఈ డివైజ్‌లను పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ నగరంలో పరిశీలించనున్నది. ఇందుకు బండ్లగూడ డిపోను ఎంపిక చేసింది. ఈ డిపోకు ప్రస్తుతం 145 ఐ-టిమ్స్ మెషీన్లను అందించింది. ఈ ఐ-టిమ్స్ మెషీన్లు ఎన్సీఎంసీ ద్వారా టికెట్లను ఇష్యూ చేయడానికి వీలుగా రూపొందించారు. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉన్నది. భవిష్యత్‌లో యూపీఐ ట్రాన్షాక్షన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

బండ్లగూడ డిపోలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అందించిన ఐ-టిమ్స్ మెషిన్లను 90N/U (దిల్‌షుక్‌నగర్ నుంచి ఉప్పల్), 72J (జైపురి కాలనీ నుంచి అఫ్జల్‌గంజ్), 300 (ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి మెహదీపట్నం), 210G (గౌరెల్లి నుంచి కోటి వయా బండ్లగూడ) వంటి రూట్లలో ఉయోగించనున్నారు. ప్రస్తుతం ఈ రూట్లలో టిమ్స్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. కానీ ఇకపై ఐ-టిమ్స్ ద్వారా టికెట్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మెషిన్లు చాలా వేగంగా టికెట్లను ఇష్యూ చేస్తాయని చెప్పారు.

కాగా, ప్రయాణికుల దగ్గర ఎన్సీఎంసీ కార్డులు ఉంటే.. వాటి ద్వారా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఎన్సీఎంసీ కార్డులు పని చేస్తాయి. అయితే యూపీఐ లావాదేవీలను నిర్వహించడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. రన్నింగ్ బస్సులో ఇంటర్నెట్‌ ఎలా ఏర్పాటు చేయాలనే విషయంపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లో ఎన్సీఎంసీ కార్డుల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

ఐ-టిమ్స్ మెషిన్లలో బటన్లు ఉండవని.. పూర్తిగా టచ్ స్క్రీన్ ద్వారానే టికెట్లు ఇవ్వొచ్చని అధికారులు చెప్పారు. ఇది కండక్టర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్పారు. బండ్లగూడలో పైలెట్ ప్రాజెక్టు ఫలితాల తర్వాత ఈ మెషిన్లను కంటోన్మెంట్ డిపోలో పరిశీలించనున్నట్లు అధికారులు వివరించారు.

First Published:  15 Sept 2023 7:18 AM IST
Next Story