Telugu Global
Telangana

హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టెల్లాంటిస్, రైట్ సాఫ్ట్‌వేర్

హైదరాబాద్‌లో 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టెల్లాంటిస్, రైట్ సాఫ్ట్‌వేర్
X

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి ఒక విప్లవంలా సాగుతోందని.. వ్యాపార విస్తరణకు ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెబిలిటీ కంపెనీ స్టెల్లాంటిస్ హైదరాబాద్‌లో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేసింది. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారిందని అన్నారు. సస్టెయినబుల్ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉందని చెప్పారు.

మొబిలిటీ వ్యాలీలో స్టెల్లాంటిస్ వంటి సంస్థ భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ నగరం వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలమైనదని చెప్పారు. ప్రతీ రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లను ప్రోత్సహిస్తున్నాము. సమర్థ ప్రభుత్వం, పటిష్టమైన నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఆటోమొబైల్, మొబిలిటీ రంగంలో స్టెల్లాంటిస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. 130 దేశాల్లో ఈ సంస్థకు చెందిన కస్టమర్లు ఉండగా.. 30పైగా దేశాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు, పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేశారు. ఇదొక హైబ్రీడ్ కార్యాలయం. ఉద్యోగులు ఆఫీస్ నుంచే కాకుండా.. రిమోట్ లొకేషన్ నుంచి కూడా పని చేసుకునేలా డిజైన్ చేశారు. ఇక్కడ ఒకే సారి 700 మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉన్నది. సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ యువత టాలెంట్‌కు ఈ డిజిటల్ హబ్ ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

నేను ఏపీఎస్ఈబీలో ఇంజనీర్‌గా పని చేశాను.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో రైట్ సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను 1991లో ఏపీఎస్ఈబీలో ఇంజనీర్‌గా పని చేశాను. మూడేళ్ల తర్వాత బోర్ కొట్టి ప్రైవేట్ సెక్టార్‌లోకి వెళ్లాను. బెంగళూరులో పని చేసి.. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాను. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఒక కంపెనీ పెట్టాలని అనుకున్నానని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు కృష్ణ రంగరాజు కూడా ఇలాగే అమెరికా వెళ్లి అనేక ఉద్యోగాలు చేశారు. 16 ఏళ్ల క్రితం ఎంతో ధైర్యంగా సంస్థను స్థాపించారు. అప్పట్లో పెట్టుబడులు తీసుకొని రావడం అంటే అంత సులభమైన పని కాదు. కానీ ఆయన ఎంతో కష్టపడి కంపెనీని నిలబెట్టారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లో ఇప్పుడు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇక్కడ అభివృద్థి ఒక విస్పోటనంలా మారింది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఇక్కడ 3.24 లక్షల మంది ఐటీ జాబ్స్ చేస్తుండేవారు. కానీ ఈ రోజు 9.05 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు. కేవలం 9 ఏళ్లలోనే తెలంగాణ ఐటీ ప్రగతి రాకెట్ వేగంతో దూసుకొని పోయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆనాడు ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లుగా ఉంటే.. ఈ రోజు రూ.2.41 ల‌క్ష‌ల‌ కోట్లకు పెరిగిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగింది.

రైట్ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉన్నది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ వ్యవస్థాపకుడు కృష్ణకు సూచించారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పటికే ఐటీ టవర్లు ఏర్పాటు చేశాము. రాబోయే రోజుల్లో మరి కొన్ని ఐటీ టవర్లు సిద్ధమవుతున్నాయి. అక్కడ కూడా పెట్టుబడులు రావాలని ప్రయత్నిస్తున్నాము. రైట్ సాఫ్ట్‌వేర్ కూడా అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.



First Published:  5 July 2023 1:08 PM IST
Next Story