తెలంగాణ ప్రచారంలో మార్మోగుతున్న రాజయ్య డప్పు
కడియంతో చేతులు కలిపినా ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా ఉంటారేమో అనే అనుమానాలున్నాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాజయ్య ఓ రేంజ్ లో ప్రచారంలో పాల్గొనడం ఇక్కడ విశేషం.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎవరి స్టైల్ వారిది. అభ్యర్థులు పాదయాత్రలు చేస్తూ, ప్రతి ఇంటికి వెళ్తూ తమకు ఓట్లు వేయాలని అడుగుతుంటారు. వారి అనుచరులు కూడా నాయకుల తరపున హడావిడి చేస్తూ కనపడుతుంటారు. మంత్రి మల్లారెడ్డి లాంటివారు ఎక్కడికక్కడ తమ ప్రత్యేకతను చూపిస్తూ హైలైట్ అవుతున్నారు. గత రెండురోజులుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డప్పు కొడుతూ చిందేస్తూ ఉన్న వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
కడియం శ్రీహరికి మద్దతుగా స్టేషన్ ఘనపూర్లో డాన్సులతో తాటికొండ రాజయ్య ప్రచారం pic.twitter.com/YvmdLQfarq
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2023
వాస్తవానికి ఎమ్మెల్యే రాజయ్య అభ్యర్థి కాదు, స్టేషన్ ఘన్ పూర్ స్థానాన్ని కడియం శ్రీహరికి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అలిగారు, కన్నీరు పెట్టుకున్నారు, కడియంపై తీవ్ర విమర్శలు చేశారు, తన వర్గాన్ని సమీకరించుకుని పార్టీ అధినేతలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ చివరికి అవేవీ సాధ్యపడక కడియంతో కలసిపోయారు. ఇప్పుడు ప్రచారంలో కడియం కంటే హుషారుగా రాజయ్య పాల్గొనడం విశేషం. స్టేషన్ ఘన్ పూర్ లో ఫుల్ జోష్ తో ఊగిపోతూ రాజయ్య డప్పు కొడుతుంటే.. కార్యకర్తలు కూడా హుషారెక్కిపోతున్నారు.
డప్పు దరువుతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్న ఎమ్మెల్యే రాజయ్య, మహిళలతో కలిసి కోలాటాలాడుతున్నారు. ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్‌కు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడియంతో చేతులు కలిపినా ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా ఉంటారేమో అనే అనుమానాలున్నాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాజయ్య ఓ రేంజ్ లో ప్రచారంలో పాల్గొనడం ఇక్కడ విశేషం. డప్పు కళాకారులు కనపడితే చాలు రాజయ్య కూడా వారితో కలసి చిందేస్తూ డప్పు వాయిస్తూ సందడి చేస్తున్నారు.
♦