Telugu Global
Telangana

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి ధర్నా.. ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద

తొలిసారిగా వారు రోడ్డెక్కబోతున్నారు, మూకుమ్మడిగా ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టాండ్లు, బస్‌ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి ధర్నా.. ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు, అప్పుడే ధర్నాలు మొదలవుతున్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తొలి బాధితులుగా మారిన ఆటో డ్రైవర్లు తొలి ధర్నాకు సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతినెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నేతలు. తెలంగాణభవన్‌ లో ఆటో డ్రైవర్లతో సమావేశం జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆంక్షలను తొలగించింది. అక్కడ ధర్నా చేపట్టే హక్కు అందరికీ ఉందని ప్రకటించింది కూడా. పార్లమెంట్ సభ్యుల మూకుమ్మడి సస్పెన్షన్ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ అక్కడ తొలిధర్నా చేపట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ధర్నా జరగబోతోంది.

ఆటో డ్రైవర్ల కార్యాచరణ..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు. తొలిసారిగా వారు రోడ్డెక్కబోతున్నారు, మూకుమ్మడిగా ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టాండ్లు, బస్‌ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. ఈ నెల 4న హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఆటో డ్రైవర్ల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు

మరోవైపు ఈ ధర్నా పొలిటికల్ టర్న్ తీసుకోవడం విశేషం. కాంగ్రెస్ తీసుకొచ్చిన మహిళల ఉచిత రవాణా పథకంతో రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్‌ సీటర్‌ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆటో డ్రైవర్లతో సమావేశమైంది. ఆటో డ్రైవర్ల ధర్నాకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారికంగా ఈ సమస్యపై స్పందించాల్సి ఉంది.

First Published:  1 Jan 2024 6:46 AM IST
Next Story