కేసీఆర్ వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
రాజస్థాన్‌లో మృతి చెందిన సైఫుద్దీన్ కుటుంబీకులు రోడ్డున పడ్డారని, వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. దేశవ్యాప్తంగా విద్వేషం పెరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం మతసామరస్యం వెల్లివిరుస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మణిపూర్, హర్యానాలో జరుగుతున్న హింసాకాండను ప్రస్తావించారు. రాజస్థాన్‌లో ఆర్పీఎఫ్ అధికారి చేతిలో దారుణంగా హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన సైఫుద్దీన్ గురించి వివరించారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండ.. తెలంగాణలో అడుగుపెట్టకుండా చూడాలని.. సీఎం కేసీఆర్ మీద తమకు నమ్మకం ఉందని అక్బరుద్దీన్ చెప్పారు.
రాజస్థాన్‌లో మృతి చెందిన సైఫుద్దీన్ కుటుంబీకులు రోడ్డున పడ్డారని, వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సైఫుద్దీన్ భార్యకు ఉపాధి కల్పిస్తామని, డబుల్ బెడ్రూం ఇంటిని కూడా మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సైఫుద్దీన్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని.. ఒక్కొక్కరి పేరు మీద రూ.2 లక్షల చొప్పున బీఆర్ఎస్ తరపున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే బాధితుల వివరాలను ఇవ్వాలని ఓవైసీని కోరారు.
రాష్ట్రంలో రెసిడెన్షియల్స్ స్కూల్స్ అద్భుతంగా పని చేస్తున్నాయని, ప్రభుత్వం వాటిని చక్కగా నిర్వహిస్తోందని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. మన ఊరు మన బడి కార్యక్రమం వల్ల పాఠశాలలు బాగుపడుతున్నాయని చెప్పారు. వైద్య రంగంలో కూడా ప్రభుత్వం అద్బుతంగా పని చేస్తోందని చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును అభినందిస్తున్నామని చెప్పారు.