దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులతో పాటు డిండి ప్రాజెక్ట్, ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువలపై నేడు దేవరకొండలో మంత్రులు ప్రత్యేక సమీక్ష చేయనున్నారు.
దక్షిణ తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దశాబ్దకాలంగా గత ప్రభుత్వం లో వివక్షకు గురైన ప్రాజెక్ట్ ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. పైగా ప్రాజెక్ట్ ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,292 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టగా.. బీఆర్‌ఎస్‌ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన అంచనాలు రెట్టింపు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ఉద్దేశ్యపురంకంగానే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పై ఉదాసినత చూపెట్టిందంటూ విరుచుకపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం నల్లగొండ జిల్లా దేవరకొండ కొండలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి మంత్రులు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులతో పాటు డిండి ప్రాజెక్ట్, ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాలువలపై నేడు దేవరకొండలో మంత్రులు ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లుఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. వీరితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ప్రధానంగా 2005 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆమోదంతో రూ. 2,292 కోట్లకు పాలనా అనుమతులు పూర్తి చేసుకుని పనులు మొదలుపెట్టినా 2014 తరువాత ఈ ప్రాజెక్ట్ పనులను ఆటకెక్కించారని విమర్శిస్తున్నారు. 2005 - 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1279.04 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో ఖర్చు పెట్టిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్ పై రూ. 2,643.50 కోట్లు ఖర్చు చేశారు. తిరిగి అదే ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని రూ. 4,658.89 కోట్లకు పెంచిన ప్రతిపాదనలు అనుమతుల కోసం ప్రభుత్వానికి 2023 డిసెంబర్ లో పంపించారు. ఆ తరువాత కాలంలో ఎన్నికలు జరగడం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో మళ్ళీ ఎస్. ఎల్.బి.సి.టన్నెల్ పనుల ప్రస్తావన ప్రముఖంగా చర్చలోకి వచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటిఇవరకు ఏమి జరిగింది... ఏమి జరగలేదన్నది తెలుసుకుని, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేయడానికి ఈ సమీక్ష నిర్వహిస్తున్నది.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులకు మాత్రమే ఈ సమీక్షను పరిమితం చెయ్యకుండా సుమారు లక్ష ఎకరాలను సేద్యం లోకి తేవడంతో పాటు నార్కెట్ పల్లి,నల్లగొండ,చిట్యాల,మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం లతో పాటు కట్టంగూర్ మండలాల పరిధిలోని 107 గ్రామాలకు సురక్షిత మంచినీటినీ అందించేందుకు ఉద్దేశించ బడిన బ్రాహ్మణవెళ్ళేంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పురోగతితో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువల పూర్తికి ఈ సమీక్ష ద్వారా రూట్ మ్యాప్ రూపొందించేందుకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.