Telugu Global
Telangana

సోషల్ మీడియాలోనూ సైలెంట్ పీరియడ్..

ఈసారి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టామంటున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. సైలెంట్ పీరియడ్ లో సోషల్ మీడియాలోనూ ప్రచారం శిక్షార్హం అంటున్నారు. బల్క్ మెసేజ్ లను కూడా మునుగోడు పరిధిలో నిషేధించారు.

సోషల్ మీడియాలోనూ సైలెంట్ పీరియడ్..
X

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. ఈ రోజు ప్రలోభ పర్వం మిగిలుంది. ఇప్పటికే పంచాల్సిన సొమ్మంతా అకౌంట్లలోకి చేరిపోయింది కాబట్టి, దాన్ని విత్ డ్రా చేసి ఓటుకు నోటు ఇవ్వడమే బ్యాలెన్స్ ఉంది. ఎన్నికల కమిషన్ కి కూడా రాజగోపాల్ రెడ్డి కాకమ్మ కథలు చెప్పేశారు, డబ్బులు పంపిన కంపెనీ నాది కాదు నా కొడుకుది అంటూ సినిమా స్టోరీ వినిపించారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలోనూ ప్రచారం కుదరదు..

ఎన్నికల ప్రచారానికి బ్రేక్ అంటే ముందుగా మైకులు మూగబోయేవి. పేపర్లో, టీవీల్లో ప్రచార పర్వాన్ని చూపించకూడదు అనేవారు. కానీ అప్పుడు జరిగింది కాబట్టి, ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నామంటూ కొన్ని ఛానళ్లలో ప్రచార ప్రసంగాలు ప్రసారమయ్యేవి. సోషల్ మీడియా వచ్చాక ప్రచారానికి అడ్డుకట్ట వేశామనుకోవడం అసంభవం. సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేశారు, ఎవరి తరపున చేశారు, మూలకారకులెవ్వరు అని వెదికే లోపే పుణ్యకాలం అయిపోతుంది. అయినా కూడా ఈసారి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టామంటున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. సైలెంట్ పీరియడ్ లో సోషల్ మీడియాలోనూ ప్రచారం శిక్షార్హం అంటున్నారు. బల్క్ మెసేజ్ లను కూడా మునుగోడు పరిధిలో నిషేధించారు.

రేపే ఉప ఎన్నిక..

గురువారం ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కోసం ఇప్పటికే పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేశారు. 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మకమైనవి 105. మొత్తం పోలింగ్ సిబ్బంది 1,192 మంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. నవంబర్-3 ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలు ఎన్నికల సరళి పరిశీలిస్తున్నాయి. నవంబర్ 6న మునుగోడు ఫలితాలు వెలువడతాయి. నల్లగొండలోని ఆర్జాలబావి గోడౌన్స్ లో కౌంటింగ్ జరగాల్సి ఉంది.

First Published:  2 Nov 2022 7:28 AM IST
Next Story