Telugu Global
Telangana

కేటీఆర్ తో శ్రీలంక మంత్రి భేటీ.. ఎందుకంటే..?

సదాశివన్ భేటీ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. హైదరాబాద్ ను అవకాశాల హబ్ గా గుర్తించినందుకు శ్రీలంక మంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్ తో శ్రీలంక మంత్రి భేటీ.. ఎందుకంటే..?
X

విదేశాల ప్రతినిధులైనా, రాజకీయ నాయకులైనా.. ఇక్కడ పర్యటనకు వస్తే అధికారంలో ఉన్న పార్టీ నేతలతోనో, ముఖ్యమంత్రితోనో, మంత్రులతోనో భేటీ అవడం ఆనవాయితీ. అయితే తెలంగాణ విషయంలో మాత్రం గత పదేళ్ల అభివృద్ధికి కారణం అయిన బీఆర్ఎస్ ని ఇరుగు పొరుగు దేశాలు కూడా గుర్తించాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీనే కావొచ్చు, కేటీఆర్ మాజీ మంత్రే కావొచ్చు, కానీ శ్రీలంక దేశ మంత్రి సదాశివన్ హైదరాబాద్ వచ్చి కేటీఆర్ ని కలిసేందుకు ఆసక్తి చూపించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిని ఆయన కొనియాడారు.


శ్రీలంక పార్లమెంట్ లో..

శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలో సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలను చూస్తుంటే సింగపూర్‌ గుర్తొచ్చిందని అన్నారాయన. గత పదేళ్లలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలి వచ్చాయని, కొత్త కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే.. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ ఉద్యోగాల రాజధానిగా మారిందని చెప్పారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు శ్రీలంక మంత్రి సదాశివన్.

సదాశివన్ భేటీ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. హైదరాబాద్ ను అవకాశాల హబ్ గా గుర్తించినందుకు శ్రీలంక మంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తమ హయాంలో సంపద సృష్టి జరిగిందని, దాన్ని సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, కొనసాగిన సంక్షేమాన్ని.. పొరుగు దేశాలు కూడా గుర్తించడం గర్వంగా ఉందన్నారు కేటీఆర్.

First Published:  19 Aug 2024 1:26 PM IST
Next Story