కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు శంకరమ్మ. అప్పుడే ఆమె కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది.
తెలంగాణ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకరమ్మ బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు శంకరమ్మ.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు శంకరమ్మ. అప్పుడే ఆమె కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేసిన శంకరమ్మ.. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం.
2009లో నవంబర్ 29న శ్రీకాంత చారి ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2009 డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన శంకరమ్మ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.