Telugu Global
Telangana

కోవర్ట్ రాజకీయాల వల్లే ఓడిపోయా - స్రవంతి

కోవర్ట్ రాజకీయాలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని, తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానన్నారు స్రవంతి.

కోవర్ట్ రాజకీయాల వల్లే ఓడిపోయా - స్రవంతి
X

మునుగోడులో బీజేపీ కొత్తగా కోవర్ట్ రాజకీయాలను ప్రోత్సహించిందని, ఆ కోవర్ట్ రాజకీయాల వల్లే తాను ఓడిపోయాయని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఈ కోవర్ట్ రాజకీయాలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని, తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానన్నారు.

500 కోట్లు పంచారు..

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కలసి 500 కోట్ల రూపాయల సొమ్ముని ఓటర్లకు పంచి పెట్టాయని మండిపడ్డారు స్రవంతి. అంగబలం, అధికార బలం ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలిచారన్నారు. పోటాపోటీగా రెండు పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టి ఓటర్లను మభ్యపెట్టారన్నారు.

కల్తీ సారా పంచారు..

మునుగోడు ఉపఎన్నికల్లో నెల రోజులపాటు ప్రతి రోజూ సారా పంచి పెట్టారని, కల్తీ సారాతో ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టారని ఆరోపించారు పాల్వాయి స్రవంతి. ఉప ఎన్నికల తర్వాత మునుగోడులో ప్రజలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోందని, కల్తీ సారా వల్లే ఈ ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయని అన్నారు.

ఫొటో మార్ఫింగ్ చేసి నీఛ రాజకీయాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తాను కలసినట్టు, తాను టీఆర్ఎస్‌కి మద్దతిచ్చినట్టు నీచ‌ రాజకీయాలు చేశారని మండిపడ్డారు స్రవంతి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గందరగోళ పరిచేందుకే ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలతో బీజేపీ మైండ్ గేమ్ ఆడిందని గుర్తు చేశారు. బీజేపీ చిల్లర రాజకీయాల వల్ల తాను మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటా..

మునుగోడు ఓటమితో తాను భయపడి పారిపోవడంలేదని ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు స్రవంతి. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోరాటం కోసం తాను ముందుంటానన్నారు. ఇవి ప్రజలు కోరుకున్న ఎన్నికలు కావని, కేవలం బీజేపీ అధికార దాహం కోసం తెచ్చిన ఎన్నికలని విమర్శించారు స్రవంతి.

First Published:  7 Nov 2022 3:59 PM IST
Next Story