మద్యం షాపుల టెండర్లకు శ్రావణ శుక్రవారం సెంటిమెంట్..!
చాలామంది శ్రావణ శుక్రవారం సెంటిమెంటు కూడా కలిసొచ్చి, తమకు పక్కాగా దుకాణం దక్కుతుందనే నమ్మకంతో ఈరోజు కోసం వెయిట్ చేశామని చెబుతున్నారు.
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపనివారంతా.. శ్రావణ మాసం మొదలుకావడంతో దరఖాస్తు చేసుకునేందుకు ఎగబడుతున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరిరోజైన శుక్రవారం శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజని.. ఆ రోజు అప్లికేషన్ వేద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో ఆడవారితో దరఖాస్తు వేయిస్తే లాటరీలో కలిసొస్తుందని నమ్మే చాలామంది శ్రావణ శుక్రవారం సెంటిమెంటు కూడా కలిసొచ్చి, తమకు పక్కాగా దుకాణం దక్కుతుందనే నమ్మకంతో ఈరోజు కోసం వెయిట్ చేశామని చెబుతున్నారు.
ఖజానాకు పైసల కిక్కు!
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పోటెత్తిపోతున్నాయి. గురువారం సాయంత్రానికే 70 వేలు దాటేశాయి. శుక్రవారం దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి రోజు. లాస్ట్ రోజు కనీసం మరో 30 వేల దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ అధికారుల అంచనా. అదే నిజమైతే దరఖాస్తుల సంఖ్య లక్ష దాటేసి, రికార్డులు సృష్టించడం ఖాయం.
ఆదాయంలోనూ రికార్డే
2021-23లో మద్యం దుకాణాలకు 68వేల అప్లికేషన్లు పడ్డాయి. ఒక్కో అప్లికేషన్‌తో పాటు నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద రూ.2 లక్షలు కట్టాలి. ఆ లెక్కన అప్లికేషన్ ఫీజే 1,360 కోట్ల రూపాయలు ఖజానాకు చేరింది. ఈసారి అప్లికేషన్లు లక్షకు చేరతాయని అంచనా వేస్తున్నందున ఆదాయం 2వేల కోట్ల రూపాయలు రానుంది. అదే జరిగితే ఆదాయంలోనూ సరికొత్త రికార్డు పక్కా.