Telugu Global
Telangana

లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు
X

గత ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పాలమూరు - రంగారెడ్డి సహా అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ లో ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాలమూరులోని ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వివరాలను రేపటిలోగా అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాలంలోనే పాలమూరు ఎత్తిపోతలను 90 శాతం పూర్తి చేస్తే ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఓడించారో చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఆదరాబాదరాగా పనులు చేసి పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించారన్నారు. కాలువల నిర్మాణం పూర్తి కాకుండా ఆయకట్టుకు ఎలా నీళ్లు ఇస్తారో చెప్పాలన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇంకా రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాజేశ్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘా రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్‌ రెడ్డి, విజయుడు తదితరులు పాల్గొన్నారు.

First Published:  25 Sept 2024 2:15 PM GMT
Next Story