Telugu Global
Telangana

భారీ వర్షాలతో భయం భయం.. ఆ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ఈ ఏర్పాటు చేశారు.

భారీ వర్షాలతో భయం భయం.. ఆ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు
X

భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెవెన్యూలో సెలవలు రద్దు చేశారు. పోలీస్ విభాగం కూడా అప్రమత్తంగా ఉంది. చెరువులు, కుంటల వద్ద సిబ్బందిని కాపలా ఉంచారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాల్లో నిత్యావసరాలు అందించేందుకు అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఈ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించడం కలెక్టర్లకు తలకు మించిన భారంలా మారింది. అందుకే వరద ప్రభావిత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఆరు జిల్లాలకు ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్.


ఏ జిల్లాకు ఎవరు..?

ములుగు జిల్లా - కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి

భూపాల పల్లి - పి గౌతమ్, సెర్ప్ సీఈఓ

నిర్మల్ - ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ కమిషనర్

మంచిర్యాల - భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రెటరీ

పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ

ఆసిఫాబాద్ - హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమిషనర్

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రతి గంటకు ఒకసారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నామని, ఇప్పటికే నిండి మత్తడి పోస్తున్న చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక చర్యలను చేపట్టామని సీఎస్ తెలిపారు. కాల్వలు, కాజ్-వే ల గుండా ప్రయాణం సాగించవద్దని ప్రజలకు సీఎస్ సూచించారు. సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారని సీఎస్ వివరించారు.

First Published:  27 July 2023 2:57 PM IST
Next Story