త్వరలో ప్రత్యేక శాసన సభ సమావేశాలు.. గవర్నర్ తిప్పి పంపిన బిల్స్‌పై చర్చ!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం మనీ బిల్లు కాకుండా.. ఇతర ఏ రకమైన బిల్లులను గవర్నర్ తిప్పి పంపినా తప్పకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తిరిగి ఆమోదించాల్సిన అవసరం ఉంది.
త్వరలో ప్రత్యేక శాసన సభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శాసన సభలో పాస్ అయిన 9 బిల్లులను గవర్నర్ తమిళిసై వద్దకు పంపగా.. రెండు బిల్లులను తిప్పి పంపగా, రెండింటిని తిరస్కరించిన విషయం తెలిసిందే. వీటిపై తిరిగి చర్చించి.. మరోసారి ఆమోదించుకొని గవర్నర్ ఆమోదం కోసం మళ్లీ పంపిస్తారు. తిప్పి పంపిన బిల్లులకు సంబంధించి మరింత సమగ్రమైన వివరాలు కావాలని గవర్నర్ తమిళిసై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో వీటిపై శాసన సభలో మరోసారి చర్చ జరపడానికే.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ మున్సిపల్ చట్టం (సవరణ) బిల్లు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయసు రెగ్యులైజేషన్ (సవరణ) బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యలైజేషన్)(సవరణ) బిల్లు, తెలంగాణ పంచాయతి రాజ్ (సవరణ) బిల్లులకు సంబంధించి మరింత సమగ్రమైన వివరాలు కావాలని గవర్నర్ కోరారు. ఈ నాలుగు బిల్లులపై మరింత చర్చ జరిపి, అవసరమైతే మరోసారి సవరణలు చేసి తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం మనీ బిల్లు కాకుండా.. ఇతర ఏ రకమైన బిల్లులను గవర్నర్ తిప్పి పంపినా తప్పకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తిరిగి ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఉభయ సభలు మరోసారి ఆ బిల్లులను ఆమోదించాల్సిందిగా గవర్నర్‌కు సందేశం పంప వలసి ఉంటుంది. ఆ బిల్లులను ఎందుకు తిప్పి పంపారో వివరాలు ఇవ్వమని కోరడం లేదా ఆమోదించమని రిక్వెస్ట్ చేయడానికి ప్రత్యేక సమావేశాలు తప్పకుండా అవసరం అవుతాయి.
అసెంబ్లీ, కౌన్సిల్‌లో మరోసారి బిల్లులు ఆమోదం పొందితే గవర్నర్ వాటిని మళ్లీ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉండదు. తప్పకుండా వాటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. తెలంగాణ మున్సిపల్ లా బిల్లును గవర్నర్ తిరస్కరించారు. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం మూడు ఏళ్లు వేచి ఉండాలని గతంలో ఉన్న నిబంధన సవరిస్తూ నాలుగేళ్లు చేశారు. అంతే కాకుండా రాజ్యసభ సభ్యులకు ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు కల్పిస్తూ, మైనార్టీ కోటాను అమలు చేస్తూ బిల్లులో సవరణలు చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా, గవర్నర్ తిరస్కరించిన బిల్లులు ఇంకా తమ వద్దకు చేరలేదని తెలంగాణ లా, లెజిస్లేటివ్, జస్టిస్ వ్యవహారాల సెక్రటరీ నందికొండ సరసింగరావు చెప్పారు. బిల్లులు ఎందుకు తిప్పి పంపారో రాజ్‌భవన్ నుంచి లేఖ వస్తే.. తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకుంటుందని ఆయన చెప్పారు.