TSPSC పేపర్ లీకేజ్ కేసులో చార్జ్ షీట్
సిట్ అరెస్ట్ చేసిన వారిలో 16 మంది దళారులు కాగా మిగతా వాళ్లు అభ్యర్థులు. ఈ కేసు విచారణ చేపట్టిన మూడు నెలలలోపే సిట్ అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.
TSPSC పేపర్ లీకేజీ కేసుని దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 36మంది నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. 98 పేజీల ఈ చార్జ్ షీట్ లో కేసు వివరాలు, ఇన్వెస్టిగేషన్ సాగిన తీరుని పొందుపరిచింది. మొత్తం 49మందిని అరెస్ట్ చేసినట్టు చార్జ్ షీట్ లో పేర్కొంది. న్యూజిలాండ్ లో ఉన్న ఒక నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ తెలిపింది.
రూ.1.63 కోట్ల లావాదేవీలు...
10 లక్షల రూపాయలకు పేపర్ అమ్మారంటూ మొదలైన ఆరోపణలు కాస్తా సిట్ దర్యాప్తులో కోటీ 63 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. ఒకరినుంచి ఇంకొకరు, వారినుంచి మరొకరు.. ఇలా ప్రశ్నా పత్రాలను రిటైల్ గా అమ్ముకుంటూ లావాదేవీలు జరిపారు. వీటి విలువ మొత్తం రూ.1.63 కోట్లుగా సిట్ నిర్థారించింది. దానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించింది.
అభ్యర్థులు, దళారులు..
సిట్ అరెస్ట్ చేసిన వారిలో 16 మంది దళారులు కాగా మిగతా వాళ్లు అభ్యర్థులు. వీరిలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ప్రధాన నిందితులు. ఈ కేసు విచారణ చేపట్టిన మూడు నెలలలోపే సిట్ అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీజ్ చేసి రామాంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపింనట్టు సిట్ వెల్లడించింది.
సీబీఐకి బదిలీ చేస్తారా..?
TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు వద్దని, సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై సింగిల్ జడ్జి వాదనలు విన్నారు. నిందితులపై చార్జ్ షీట్ దాఖలైందని TSPSC తరపు లాయర్ కోర్టుకి విన్నవించారు. సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వివరించారు. సీబీఐకి బదిలీ ఎందుకని పిటిషనర్ ను ప్రశ్నించిన కోర్టు, విచారణను 3 వారాలు వాయిదా వేసింది.