Telugu Global
Telangana

'మెహుల్ చోక్సీ' పై రెడ్ కార్నర్ నోటీసు ఉపసంహరణ... కేంద్ర సర్కార్ పై మండిపడ్డ కేటీఆర్

"మెహుల్ చోక్సీ భాయ్ రాజా సత్య హరిశ్చంద్ర కజిన్ . అతను కేవలం 13,500 కోట్ల రూపాయల అతి చిన్న బ్యాంకు మోసానికి మాతమే పాల్పడ్డాడు, అందుకే అతనికి ప్రపంచవ్యాప్తంగా స్వేచ్చగా ప్రయాణించడానికి అనుమతించారు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మెహుల్ చోక్సీ పై రెడ్ కార్నర్ నోటీసు ఉపసంహరణ... కేంద్ర  సర్కార్ పై మండిపడ్డ కేటీఆర్
X

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద రుణం తీసుకొని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు మెహుల్ చోక్సీపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు (RCN)ను ఇంటర్‌పోల్ ఉపసంహరించుకోవడంపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

ఈ దేశంలో గుజరాత్‌లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉందా? అని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


"మెహుల్ చోక్సీ భాయ్ రాజా సత్య హరిశ్చంద్ర కజిన్ . అతను కేవలం 13,500 కోట్ల రూపాయల అతి చిన్న బ్యాంకు మోసానికి మాతమే పాల్పడ్డాడు. అందుకే అతనికి ప్రపంచవ్యాప్తంగా స్వేచ్చగా ప్రయాణించడానికి అనుమతించారు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకపడ్డారు.

''వేల‌ కోట్ల కుంభకోణానికి కారణమైన మెహుల్ చోక్సీని ప్రధాని మోడీ "హమారే మెహుల్ భాయ్" అని ప్రస్తావించేవారు.

ఇంటర్‌పోల్ మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును ఎందుకు ఉపసంహరించుకుందో ప్రపంచానికి తెలుసు'' అని జగన్ పాటి మీది అనే నెటిజన్ కామెంట్ చేయగా,

''చోక్సీ తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, తమ లీగల్ టీమ్ ప్రయత్నాల కారణంగా చోక్సీ రెడ్ కార్నర్ నోటీసు రద్దు చేయబడిందన్నారు. దీన్ని బట్టి ఈ కేసులో మరో పక్షం (సీబీఐ) లీగల్ టీమ్ ఎంత గొప్పగా పనిచేసిందో అర్దమవుతోంది.'' అని గౌతమ్ పోతగోని అనే నెటిజన్ వ్యాఖ్యానించారు.

First Published:  21 March 2023 2:58 PM GMT
Next Story