మరో మూడు రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్‌ను తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో రాయలసీమతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
వ్యవసాయానికి ఊపిరిపోసే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే భారతదేశాన్ని పలకరించాయి. సాధారణంగా జూన్ 11వ తేదీ నాటికి దేశమంతా వ్యాపిస్తాయి. ఈసారి చాలా ముందే కేరళ తీరాన్ని తాకాయి. అక్కడి నుంచి రాయలసీమకు నిన్ననే ప్రవేశించాయి. త్వరలోనే తెలంగాణను కూడా నైరుతి పలకరించబోతోంది.
6వ తేదీ కల్లా తెలంగాణకు..
నైరుతి రుతుపవనాలు ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్‌ను తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో రాయలసీమతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణకు ఈనెల 6న నైరుతి రాబోతోందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇప్పటికే వర్షాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణను ఇంకా తాకనప్పటికీ పక్కనున్న రాయలసీమలో ఆ ప్రభావం ఉండటంతో తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలంగాణ వాతావారణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.