Telugu Global
Telangana

సోనియా గాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకమే..!

రేవంత్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో మరోసారి సొంత పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సోనియాగాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకమేనంటూ కల్వ సుజాత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఇమేజ్ ని మరింతగా డ్యామేజీ చేస్తున్నాయి.

సోనియా గాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకమే..!
X

సోనియా గాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకమే..!

సరిగ్గా ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండురోజులపాటు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది, కాంగ్రెస్ దిష్టిబొమ్మలు తగలబెట్టింది. అయితే హస్తం పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టకపోగా ఈ వ్యవహారంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మూడు గంటలే మా విధానం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తమ అధినాయకురాలు సోనియాగాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకం అని తేల్చి చెప్పారు తెలంగాణ అధికార ప్రతినిధి కల్వ సుజాత. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ ఉద్దేశమేంటి..?

ఉచిత విద్యుత్ తో లాభం పొందుతున్న తెలంగాణ రైతాంగాన్ని శత్రువులుగా చేసుకోవడం కాంగ్రెస్ ఉద్దేశం కాదు. అయితే ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న కాంగ్రెస్ నేతలు తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. 3 పంటలు కావాలా, 3 గంటలు కావాలా అంటూ మంత్రి కేటీఆర్ అడిగిన సూటి ప్రశ్నకు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది. అయితే రేవంత్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో మరోసారి సొంత పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సోనియాగాంధీ కూడా ఉచిత విద్యుత్ కి వ్యతిరేకమేనంటూ కల్వ సుజాత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఇమేజ్ ని మరింతగా డ్యామేజీ చేస్తున్నాయి.


తక్కువ గంటలు ఇచ్చినా నాణ్యమైన విద్యుత్, కోతలు లేకుండా ఇవ్వాలనేది కాంగ్రెస్ డిమాండ్. అయితే ఆ విషయంలో వారు ఉచిత విద్యుత్ కే వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. విద్యుత్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తోందంటూ బీఆర్ఎస్ ని విమర్శించే క్రమంలో అసలు ఉచిత విద్యుత్ అవసరమా అంటున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులోకం కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తోంది. సరిగ్గా ఎన్నికల వేళ కాంగ్రెస్ పూర్తిగా ఇరకాటంలో పడింది. ఇప్పటికైనా ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇస్తే సరే సరి. లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ కి అసలైన ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకోక తప్పదు.

First Published:  13 July 2023 11:12 AM IST
Next Story